బిజెపిలో చేరిన మాజీ ఎంపి..ఎంత కాలం ఉంటారో ?

రాష్ట్రంలో బలపడేందుకు బిజెపి చేస్తున్న ప్రయత్నాలు కొత్తా గీతతో మొదలైనట్లుంది. అరకు పార్లమెంటు మాజీ సభ్యురాలు కొత్తా గీత బిజెపిలో చేరారు. కేంద్ర హోం శాఖమంత్రి, బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా సమక్షంలో ఢిల్లీలో కమలం కండువా వేసుకున్నారు.

తెలుగురాష్ట్రాల్లోని ఇతర పార్టీ నేతలను బిజెపిలోకి లాక్కునేందుకు కొంతకాలంగా పార్టీ నేతలు పెద్ద ఎత్తున వల విసురుతున్న విషయం తెలిసిందే. బిజెపి దృష్టంతా ప్రధానంగా  టిడిపిపైనే ఉంది. టిడిపి అనంతపురం మాజీ ఎంపి జేసి దివాకర్ రెడ్డి మాట్లాడుతూ తనతో పాటు చాలామంది నేతలతో బిజెపి టచ్ లో ఉన్నట్లు తాజాగా పెద్ద బాంబు పేల్చిన విషయం అందరికీ తెలిసిందే.

2024 ఎన్నికలే లక్ష్యంగా బిజెపి ఇప్పటి నుండే  పావులు కదుపుతోంది. పార్టీలో ఇపుడున్న నేతలను నమ్మకుంటే అప్పుడు కూడా డిపాజిట్లు రావని పార్టీ కేంద్ర నాయకత్వానికి బాగా అర్ధమైపోయింది. అందుకనే ఇతర పార్టీల్లో బలమైన నేతలపై దృష్టి పెట్టింది. అందులో భాగంగానే టిడిపి నేతలను బాగా గోకుతోంది.

సరే ఆ విషయం ఎలాగున్నా ప్రస్తుతానికైతే ఫిరాయింపు నేత, మాజీ ఎంపి కొత్తా గీత బిజెపిలో చేరారు. 2014లో వైసిపి తరపున గెలిచిన తర్వాత టిడిపిలోకి ఫిరాయించారు. తర్వాత చంద్రబాబుతో పడకపోవటంతో బయటకు వచ్చేశారు. మొన్నటి ఎన్నికలకు ముందు సొంత కుంపటి కూడా పెట్టుకున్నారు. తనను తాను చాలా ఎక్కువగా ఊహించుకోవటమే గీతలోని సమస్య. అందుకే ఇపుడు ఎటూ కాకుండా పోయి బిజెపిలో చేరారు. మరి బిజెపిలో అయినా ఎంత కాలం ఉంటారో చూడాల్సిందే.