ఆంధ్రప్రదేశ్ పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని చేసిన వ్యాఖ్యలకి నిరసనగా దీక్షకు ప్రయత్నించిన మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావును మంగళవారం నాడు ఉదయం అరెస్ట్ చేశారు. ఈ కారణంగా విజయవాడ గొల్లపూడి సెంటర్ లో టెన్షన్ వాతావరణం నెలకొంది. సోమవారం నాడు మైలవరం నియోజకవర్గంలో ఇళ్ల పట్టాల పంపీణీ కార్యక్రమం సందర్భంగా ఏపీ మంత్రి కొడాలి నాని మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావుపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
దేవినేని ఉమా మహేశ్వరరావు ఇంటికి వెళ్లి బడిత పూజ చేస్తానని హెచ్చరించారు. ఈ వ్యాఖ్యలకు నిరసనగా గొల్లపూడి సెంటర్ లోని ఎన్టీఆర్ విగ్రహాం వద్ద దీక్షకు దిగుతానని దేవినేని ఉమా మహేశ్వరరావు ప్రకటించారు. అంతేకాదు ఎన్టీఆర్ విగ్రహాం వద్ద తాను కూర్చొంటాను.. టచ్ చేసి చూడాలని సీఎం జగన్ కు ఏపీ మంత్రి కొడాలి నానికి దేవినేని ఉమా మహేశ్వరరావు సవాల్ విసిరారు.
ఈ మేరకు గొల్లపూడిలోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద దీక్ష చేపట్టేందుకు సిద్ధమైన తెదేపా నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావును పోలీసులు అరెస్టు చేయడంతో ఉద్రిక్తత ఏర్పడింది. కోవిడ్ నిబంధనల నేపథ్యంలో దీక్షకు అనుమతి లేదని పోలీసులు దేవినేని ఉమా మహేశ్వరరావును అరెస్ట్ చేశారు.