పాపం.. టిడిపి నేతలకు ఎంత కష్టమొచ్చిందో ?

గతంలో ఎన్నడూ లేనివిధంగా తెలుగుదేశంపార్టీ నేతలు పూర్తిగా వెన్నెముక లేకుండా ఒంగిపోయినట్లయిపోయారు. వివిధ పార్టీల విషయంలో చంద్రబాబునాయుడు రోజుకోరకంగా చేస్తున్న సర్కసును ఫాలో అవ్వలేక నానా అవస్తలు పడుతున్నారు. టిడిపి ఏర్పాటయినప్పటి నుండి నేతలకు ఇటువంటి దుర్గతి పట్టలేదంటే ఆశ్చర్యమేస్తుంది. చంద్రబాబు ఎవరిని తిడితే వారిని తాము కూడా తిట్టలేక, చంద్రబాబు ఎవరిని పొగిడితే వారిని పొగడ లేక టిడిపి నేతలు నానా అవస్తలు పడుతున్నారంటే నమ్మండి. పొద్దున లేచిన తర్వాత చంద్రబాబు ఎవరిని తిడతారో తెలీక, ఎవరిని  పొగుడుతారో తెలీక నేతల్లో అయోమయం చోటు చేసుకుంటోంది.

2018 వరకూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ పొగిడిన టిడిపి నేతలే విడిపోయాక తిట్టటం స్టార్ట్ చేశారు. మళ్ళీ మధ్యలో పవన్ ను తిట్టటాన్ని చంద్రబాబు  ఆపేయగానే తాము ఆపేశారు. మళ్ళీ ఆదేశాలు రాగానే తిట్టిన నేతలు తాజాగా అసలు పవన్ గురించి మాట్లాడటమే మానేశారు. అయితే టిడిపితో పొత్తుండదని పవన్ చెప్పగానే నోటికి పనిచెప్పటం మొదలుపెట్టారు. నాలుగేళ్ళ పాటు రాష్ట్ర విభజనకు కారణమంటూ కాంగ్రెస్ ను చంద్రబాబు ఎన్ని అమ్మనాబూతులు తిట్టారో అందరూ విన్నదే. అదే పద్దతిలో నేతలు కూడా కాంగ్రెస్, సోనియా గాంధి, రాహూల్ గాంధిలపై దుమ్మెత్తిపోసేవారు. ఎప్పుడైతే చంద్రబాబు ఎన్డీఏలో నుండి బయటకు వచ్చేశారో వెంటనే కాంగ్రెస్ కు మద్దతుగా మాట్లాడటం మొదలెట్టారు.

తెలంగాణా ఎన్నికల్లో పొత్తు పెట్టుకోగానే కాంగ్రెస్ తో పాటు సోనియా, రాహూల్ గాంధీలకు భజన చేయటం మొదలు పెట్టారు.  ఎన్డీఏలో ఉన్నంత వరకూ మోడి భజనను చంద్రబాబు తో పాటు టిడిపి నేతలు కూడా ఏ స్ధాయిలో చేశారో అందరూ చూసిందే. నరేంద్రమోడి లాంటి ప్రధానమంత్రిని తాను ఇంత వరకూ చూడలేదంటూ బిజెపి నేతలు కూడా సిగ్గుపడే స్ధాయిలో భజన చేశారు చంద్రబాబు. ఎప్పుడైతే ఎన్డీఏలో నుండి బయటకు వచ్చేశారో వెంటనే శాపనార్ధాలు పెట్టటం మొదలుపెట్టారు. ఇక, రాష్ట్రం విడిపోయినప్పటి నుండి అవసరానికి కెసియార్ ను పొగడటం, అవసరం తీరిపోగానే తెగడటం చంద్రబాబు అండ్ కోకు అలవాటైపోయింది.

టిఆర్ఎస్ తో  పొత్తు పెట్టుకోవాలని అనుకోగానే చంద్రబాబు కెసియార్ గురించి మాట్లాడటం మానేశారు. వెంటనే టిడిపి నేతలు ఎవరు కూడా మాట్లాడలేదు. అయితే, టిడిపితో పొత్తును కెసియార్ తిరస్కరించగానే వెంటనే చంద్రబాబుతో పాటు తాము కూడా తిట్టటం మొదలుపెట్టారు టిడిపి నేతలు. చంద్రబాబు చేస్తున్న రోజుకో వింత విన్యాసంతో నేతలు, అభిమానులు బాగా ఇబ్బంది పడుతున్నారు. ఏ పార్టీని ఏరోజు పొగడాలో తెలీక, ఏ రోజు తిట్టాలో తెలీక, చంద్రబాబు ఎప్పుడెవరిని పొగుడుతారో, తిడతారో తెలీక,  తామేం చేయాలో అర్ధంకాక నేతలు ప్రతిరోజు నానా అవస్తలు పడుతున్నారు. రేపటి ఎన్నికల్లో కాంగ్రెస్,  జనసేనతో పొత్తులుంటాయో ఉండవో తెలీక వాళ్ళని పొగడాలో, తిట్టాలో తెలీక చివరకు తిట్టిన వాళ్ళనే పొగుడుతూ, పొగిడిన వాళ్ళనే తిడుతూ తీవ్ర గందరగోళంలో పడిపోతున్నారు. చివకు నేతలు, అభిమానులు ఏమవుతారో ఏమో ?