షెడ్యూల్ తో నిండా ముణిగిన పవన్..దిమ్మతిరిగింది

కేంద్ర ఎన్నికల కమీషన్ ప్రకటించిన షెడ్యూల్ తో జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ కు బాగా దెబ్బ పడినట్లే అనుకోవాలి. ఎందుకంటే, షెడ్యూల్ ప్రకారం మార్చి 18వ తేదీన నామినేషన్లు మొదలవుతాయి. అంటే అప్పటికి అభ్యర్ధుల ఎంపిక అయిపోయుండాలి. లేకపోతే నామినేషన్లు వేయలేరు. అభ్యర్ధుల ఎంపికలో చంద్రబాబునాయుడు, జగన్మోహన్ రెడ్డి కసరత్తే ఇంకా కొలిక్కి రాలేదు. అలాంటిది పవన్ సంగతి చెప్పనే అక్కర్లేదు. అందుకనే షెడ్యూల్ ప్రకటన పవనపైనే తీవ్ర ప్రభావం పడే అవకాశాలున్నాయి.

ఏ క్షణంలో అయినా ఎన్నికల షెడ్యూల్ ప్రకటించే అవకాశం ఉందని అందరూ ఎప్పటినుండో ఊహిస్తున్నదే. అందుకనే చంద్రబాబు, జగన్ చాలా కాల నుండి కసరత్తులు చేస్తున్నారు. దాదాపు 100 నియోజకవర్గాల్లో వైసిపి అభ్యర్ధుల ఎంపిక కూడా పూర్తయిపోయినట్లు సమాచారం. మిగిలిన నియోజకవర్గాల్లో కూడా కొద్దిపాటి మార్పులు, చేర్పులతో ఆశావహులైతే రెడీగానే ఉన్నారు. కాబట్టి వారంలోగా అన్నీ నియోజకవర్గాలకు అభ్యర్ధులకు ఎంపిక అయిపోవచ్చు.

అదే సమయంలో చంద్రబాబు కూడా సమీక్షలతో బిజీగా ఉన్నారు. ఇప్పటి వరకూ అధికారికంగా అభ్యర్ధులను ప్రకటించలేదు కానీ దాదాపు 50 నియోజకవర్గాల్లో అభ్యర్ధులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసినట్లు లీకులిచ్చారు. మిగిలిన నియోజకవర్గాల్లో కూడా స్పీడ్ పెంచుతున్నారు. మొత్తానికి అభ్యర్ధులను ఫైనల్ చేయటంలో చంద్రబాబుకు కూడా ఇబ్బందులు తప్పేట్లు లేదు.

ఇటువంటి నేపధ్యంలోనే అసలు కసరత్తే మొదలుపెట్టని పవన్ పరిస్ధితి ఏమిటో ఊహించుకోవచ్చు. ఇప్పటి వరకూ  తూర్పుగోదావరి జిల్లాలోని ముమ్మిడివరంలో పితాని బాలకృష్ణను తప్ప రెండో అభ్యర్ధినే ప్రకటించలేదు. చివరకు తాను ఎక్కడి నుండి పోటీ చేయాలో కూడా పవన్ తేల్చుకోలేదు. ఒకసారి తిరుపతన్నారు. ఇంకోసారి పిఠాపురం అన్నారు. మొన్నేమో గాజువాకన్నారు. ఈ పరిస్దితుల్లో 175 అసెంబ్లీలు, 25 పార్లమెంటు నియోజకవర్గాలకు అభ్యర్ధులను ప్రకటించటమంటే మామూలు విషయం కాదు. చివరకు తెలంగాణా ఎన్నికల్లో దుకాణం మూసేసినట్లే ఏపి ఎన్నికల్లో కూడా అదే చేస్తారా ? లేకపోతే హోల్ సేల్ గా చంద్రబాబుకు అప్పగించేస్తారా ? అన్నదే చూడాలి.