భారతీయ జనతా పార్టీ చెత్త రాజకీయాలు ఎలా వుంటాయో చెప్పడానికి ఇదొక ఉదాహరణ మాత్రమే. రాష్ట్రాల్ని తమ రాజకీయాలకు ప్రయోగ శాలల్లా మార్చేసుకోవడం బీజేపీకి కొత్తేమీ కాదు. ఒకప్పటి బీజేపీ వేరు, ఇప్పటి బీజేపీ వేరు.
ఏ రాష్ట్రంలో అయినా, చిన్నపాటి రాజకీయ సంక్షోభం కనిపించిందంటే చాలు.. అక్కడ బీజేపీ మార్కు రాజకీయం మొదలైపోతుంటుంది. ఒకవేళ ఏదన్నా రాష్ట్రంలో పూర్తిగా ప్రశాంత వాతావరణం వుంటే, అక్కడా అలజడి రేపి తనదైన రాజకీయం చేస్తుంటుంది బీజేపీ.
కర్నాటకలో బీజేపీ రాజకీయం చూశాం. తమిళనాడు సహా చాలా రాష్ట్రాల్లో బీజేపీ రాజకీయం చూశాం. తాజాగా, మహారాష్ట్రలో బీజేపీ రాజకీయం చూస్తున్నాం. ఉద్దవ్ ధాక్రే ప్రభుత్వాన్ని కూల్చేసి, ఏక్‌నాథ్ షిండే ప్రభుత్వాన్ని తీసుకొస్తోంది బీజేపీ.
తమ చెప్పు చేతల్లో వుండే ఏక్‌నాథ్ షిండేని శివసేన రెబల్ నేతగా మార్చింది బీజేపీనే. ఇప్పుడు ఆయన్ని ముఖ్యమంత్రి పదవిలో కూర్చోబెడుతోంది. అదేంటీ, బీజేపీనే ఆ పదవిలో కూర్చోవచ్చు కదా.? అంటే, అది ముళ్ళ పాన్పు అని బీజేపీకి తెలుసు మరి. అందుకే, ఆ స్థానంలోకి ఏక్‌నాథ్ షిండేని నెట్టేసింది బీజేపీ.
‘బీజేపీ చాలా పెద్ద త్యాగం చేసింది.. నన్ను ముఖ్యమంత్రిని చేసింది..’ అంటూ శివసేన రెబల్ లీడర్ ఏక్‌నాథ్ షిండే మురిసిపోతున్నారు. ఈ ముచ్చట మూణ్ణాళ్ళేనని ఆయనకు కొద్ది రోజులు ఆగితే తెలుస్తుంది.