కామారెడ్డి నియోజకవర్గంలో షబ్బీర్ అలీని గెలిపిస్తే ఆయన నంబర్-2 పొజిషన్ లో ఉంటారు. మీకు మేలు జరుగుతుందని తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆ పార్టీలో తీవ్ర దూమారాన్ని రేపుతున్నాయి. ఇంకా అధికారంలోకి రాలేదు. సీట్ల సర్దుబాటు లేదు, అభ్యర్థుల పేర్లను ప్రకటించకుండానే ఈ తరహా వివాదాస్పద వ్యాఖ్యలేంటని సీనియర్లు అంటున్నారు.
రేవంత్ మాటలపై ఎవరూ బహిరంగంగా విమర్శించకపోయినా, ఈ కొత్త సంస్కృతితో పార్టీకి నష్టమేనని సీనియర్లు అభిప్రాయపడుతున్నారు. పార్టీలో ఐక్యతను దెబ్బతీసే ఈ వ్యాఖ్యలు మంచివి కావని, ఎన్నికల వేళ పదవులు, స్థానాల గురించి మాట్లాడితే, ప్రజలు తప్పుగా అర్థం చేసుకునే అవకాశం ఉందంటూ, కాంగ్రెస్ మాజీ ఎంపీ ఒకరు రాహుల్ గాంధీకి లేఖను రాసినట్టు తెలుస్తోంది.
ఇదిలావుండగా, షబ్బీర్ అలీ గెలిస్తే, ఉప ముఖ్యమంత్రి అవుతారన్నట్టు రేవంత్ చేసిన వ్యాఖ్యలు అటు తెలుగుదేశం పార్టీలోనూ ప్రకంపనలు పుట్టించాయి. ఉన్నట్టుండి రేవంత్ అలా ఎలా మాట్లాడారని గాంధీభవన్ లో చర్చ కూడా సాగుతోంది. ఆయన వ్యాఖ్యలతో సీఎం ఆశావహుల జాబితా పెరిగిపోయే ప్రమాదం ఉందని గాంధీ భవన్ వర్గాల్లో చర్చ సాగుతోంది.
కాంగ్రెస్ లో ఇప్పటికే 10 మంది సీఎం అభ్యర్ధులున్నారంటూ టిఆర్ ఎస్ చేస్తున్న విమర్శలకు తోడు రేవంత్ మాటలతో డిప్యూటి సీఎం ఆశావహుల జాబితా కూడా పెద్దదవుతుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. దీని వల్ల పార్టీకి నష్టమే తప్ప లాభం లేదని పలువురు అభిప్రాయ పడ్డారు. ముఖ్యంగా సామాజిక కోణలో ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన నేతలు ఇప్పుడు ఈ జాబితాలో చేరుతారని పలువురు నేతలన్నారు. రేవంత్ వ్యాఖ్యలు కాంగ్రెస్ లో కాక పుట్టించాయి.