బిజెపిలోకి ధోని…పావులు కదుపుతున్న నాయకత్వం

తొందరలో క్రికెట్ దిగ్గజం ఎంఎస్ ధోని బిజెపిలోకి చేరనున్నట్లు తెలుస్తోంది. బిజెపి నేతలే ఆమటను చెబుతున్నారు. క్రికెట్ నుండి రిటైర్మెంట్ తీసుకోగానే ధోని రాజకీయాల్లోకి ప్రవేశిస్తారంటూ ఒకటే ఊదరగొడుతున్నారు. దాంతో రాజకీయాల్లోకి ప్రవేశించటం కన్నా ముందుగా రిటైర్మెంట్ మీదే అందరూ ఫోకస్ పెడుతున్నారు.

ధోని వయసు కూడా ఇపుడు దాదాపు 38లో ఉంది. అంటే క్రికెట్ నుండి రిటైర్ కావాల్సిన సమయం వచ్చేసినట్లే. ఈమధ్యనే ధోని బిజెపి చీఫ్ అమిత్ షా తో భేటీ కావటంతో రాజకీయ ప్రవేశానికి కావాల్సినంత మసాలా దొరికేసింది. ఇంకేముంది ధోని అభిమానులు, వ్యతిరేకులు కూడా ఎవరికి తోచినట్లుగా వారు సోషల్ మీడియాలో కథనాలతో రెచ్చిపోతున్నారు.

ఇదే విషయమై బిజెపి కేంద్ర మాజీమంత్రి, సీనియర్ నేత సంజయ్ పాస్వాన్ పెద్ద బాంబే పేల్చారు. తొందరలో అంటే క్రికెట్ నుండి రిటైర్ కాగానే ధోని తమ పార్టీలో చేరుతారంటూ ప్రకటించారు. క్రికెట్ టీమును వదిలేసిన తర్వాత నరేంద్రమోడి టీములో ధోని ఆట మొదలవుతుందంటూ చెప్పారు పాస్వాన్.

ధోని తనకు మంచి మిత్రుడని బిజెపిలో చేరే అంశంపై ఇప్పటికే తనతో చాలా రోజులుగా చర్చలు జరుపుతున్నట్లు పాస్వాన్ చెప్పటం గమనార్హం. రిటైర్మెంట్ తీసుకోగానే బిజెపిలో చేరే అంశంపై ధోనినే ఓ ప్రకటన చేస్తారంటూ ఈ మాజీ మంత్రి తెలిపారు. బహుశా ఈ ఏడాది చివరలో జరుగనున్న జార్ఖండ్ ఎన్నికల్లో ధోని కీలక పాత్ర పోషిస్తారేమో చూడాలి.