ఏసు వర్ధంతే క్రిస్త్ మస్..ఆది సంచలనం

తెలుగుదేశంపార్టీ నేతలకు వర్ధంతులకు, జయంతులకు తేడా తెలీటం లేదు. ఏసు వర్ధంతి అంటే మరణించిన రోజునే క్రిస్తియన్లు క్రిస్త్ మస్ గా జరుపుకుంటున్నారంటూ ఫిరాయింపు మంత్రి ఆదినారాయణరెడ్డి కొత్త నిర్వఛనం చెప్పారు. ఫిరాయింపు మంత్రి చెప్పిన కొత్త నిర్వచనంతో అందరూ ఆశ్చర్యపోయారు. ఇప్పటికే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి, వర్ధంతికి తేడా తెలీకుండా మాట్లాడిన చంద్రబాబునాయుడు పుత్రరత్నం, మంత్రి నారా లోకేష్ ను నెటిజన్లు అప్పట్లో ఒక రేంజిలో ఆటాడుకున్న విషయం అందరికీ తెలిసిందే. తాజాగా మరో మంత్రి ఆదినారాయణరెడ్డి కూడా క్రిస్త్ మస్ పండుగపై సంచలన వ్యాఖ్యలు చేసి నెటిజన్లకు దొరికిపోయారు.

 

మాజీ మంత్రి వీరారెడ్డి వర్ధంతి కార్యక్రమంలో పాల్గొనేందుకు జిల్లాలోని బద్వేలుకు వచ్చారు. వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి వెళిపోయుంటే బాగుండేది. కానీ అక్కడి వారితో మాట్లాడుతూ, వీరారెడ్డి వర్ధంతి, ఏసుప్రభువు వర్ధంతి ఒకే రోజంటూ చెప్పటంతో అక్కడున్న వారంతా నివ్వెరపోయారు. అంటే ఆది ఉద్దేశ్యం బహుశా మాజీ మంత్రి వీరారెడ్డి కూడా ఏసు ప్రభువంత గొప్పోడని చెప్పటం అయ్యుంటుంది. ఆ చెప్పేదేదో వీరారెడ్డి గొప్పతనం వరకే చెబితే సరిపోయేది. అయితే ఏసుప్రభువు వర్ధంతితో పోల్చటంతోనే చిక్కులు వచ్చిపడింది.

 

నిజానికి ప్రపంచమంతా డిసెంబర్ 25వ తేదీన జీసస్ పుట్టినరోజుగా చెప్పుకుంటూ సంబరాలు చేసుకుంటోంది. క్రిస్త్ మస్ శుభాకాంక్షలంటూ దేశమంతటా ముందు నుండే శుభాకాంక్షలు చెప్పుకుంటున్నారు. దినపత్రికల్లో, టివి ఛానళ్ళల్లో కూడా శుభాకాంక్షలు వెల్లు వెత్తుతున్నాయి. అయినా అవేవీ ఆదినారాయణరెడ్డి దృష్టిలో పడలేదంటే ఆశ్చర్యంగానే ఉంది. అంటే ఏదో ఒకటి నోటికొచ్చింది మాట్లాడేయటమే మంత్ర ఉద్దేశ్యంగా కనబడుతోంది. తెలీకపోవటం తప్పు కాదు. తెలుసుకోకపోవటమే తప్పు. మంత్రి హోదాలో ఉన్న ఆదినారాయణరెడ్డి నోటికేదొస్తే అది మాట్లాడిదే పోయేది ప్రభుత్వం పరువే అన్న స్పృహ కూడా లేకపోవటమే ఆశ్చర్యంగా ఉంది.