పవన్ కళ్యాణ్ , రజినీకాంత్ రాజకీయాలకి సెట్ అవ్వరు !

సినిమా రంగం నుండి వచ్చి రాజకీయాల్లో రాణించిన వారు ఉన్నారు , అలాగే సినిమా ఇండస్ట్రీలో తిరుగులేని ఇమేజ్ ను సొంతం చేసుకొని, రాజకీయాల్లో పుట్టగతులు లేకుండాపోయిన వారు కూడా ఉన్నారు. నందమూరి తారక రామారావు .. తెలుగుదేశం పార్టీని స్థాపించి ,కేవలం తొమ్మిది నెలల సమయంలోనే పార్టీని అధికారంలోకి తీసుకువచ్చాడు. ఇక తమిళనాడు రాజకీయాల్లో సినీ రంగ ప్రముఖుల పాత్ర చాలా ఎక్కువగా ఉంటుంది అన్న సంగతి తెలిసిందే.

ఇకపోతే , రాజకీయాల్లోకి వచ్చి , అక్కడ కుదురుకోలేక మళ్లీ సినిమాల్లో నటిస్తున్న స్టార్ హీరోలు కూడా ఉన్నారు. ఇదిలా ఉంటే .. తెలుగు రాష్ట్రాల్లో పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ పెట్టి ప్రజల కోసం నిత్యం తపిస్తూ ఉన్నాడు. ఇక తమిళనాడు లో సూపర్ స్టార్ రజినీకాంత్ రాజకీయాల్లోకి త్వరలోనే ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. డిసెంబర్ 31 న రాజకీయ అరంగేట్రం పై కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది.

ఇదిలా ఉంటే .. పవన్ కళ్యాణ్, రజినీకాంత్ లపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ సంచలన వ్యాఖ్యలు చేసారు. దేశంలో సినీ రంగం నుంచి వచ్చిన వారిలో ఎన్టీఆర్, ఎంజీఆర్‌లు మాత్రమే సక్సెస్‌ అయ్యారని, ఇప్పుడు ఆ రంగం నుంచి వచ్చిన పవన్‌ కల్యాణ్, వస్తున్న రజనీకాంత్‌లు ఇద్దరూ రాణించలేరని అన్నారు. వారు కళా రంగానికే సేవ చేసుకుంటే మంచిదని అభిప్రాయపడ్డారు.