తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రసిడెంట్, కొడంగల్ తాజా మాజీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి కి సంబంధించిన మరో వివాదం వెలుగు చూసింది. రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్న రోజుల్లో అంటే సెప్టెంబరు 6వ తేదీ తెలంగాణ అసెంబ్లీ రద్దు కంటే ముందు జరిగిన ఈ ఘటన తాజాగా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఎన్నికల వేళ ప్రత్యర్థులే ఈ ఘటన తాలూకు ఆడియోను బయటపెట్టారా? లేదంటే ఇప్పుడే ఎందుకు వెలుగులోకి వచ్చింది అన్నది తేలాల్సి ఉంది. ఒక అధికారిని ఫోన్ లో రేవంత్ రెడ్డి బండబూతులు తిట్టిన ఆడియో ఇది. పూర్తి వివరాలు ఇవీ…
కొడంగల్ లో ఎ.ఇ. వినోద్ అనే అధికారిని రేవంత్ రెడ్డి ఫోన్ చేసి బూతులు తిట్టారు. పక్క నియోజకవర్గ ఎమ్మెల్యే వచ్చిన సందర్భంలో కొడంగల్ అధికారులు ఆ ఎమ్మెల్యే వద్దకు వెళ్లినట్లు రేవంత్ కు సమాచారం అందింది. దీంతో ఎఈ కి ఫోన్ చేసి పొల్లుపొల్లు తిట్టారు. అధికారులు అని కూడా చూడకుండా ఈపులు పలగొడతా అన్నారు. డీఈని, నిన్ను బట్టలూడదీసి కార్యకర్తలతో కొట్టిస్తా అని రేవంత్ కరుకు భాషలో తిట్ల పురాణం అందుకున్నారు. కొడంగల్ కు ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నరా అంటూ ఆ అధికారిని కడిగి పారేశారు.
ఇక పక్క నియోజకవర్గ ఎమ్మెల్యే (టిఆర్ఎస్) గురించి మరింత పరుషమైన కామెంట్స్ చేశారు రేవంత్. ఆ ఎమ్మెల్యేను ఉద్దేశించి బూతపురాణం ఎత్తుకున్నారు. ఏం చేయడానికి (బూతు) ఇక్కడకు వచ్చిండు… ఆయన చేసేదేమైనా ఉంటే ఆయన నియోజకవర్గంలో (బూతు) చేసుకోమ్మను అంటూ నోటికి పని చెప్పారు రేవంత్ రెడ్డి.
రేవంత్ రెడ్డి బూతులు తిట్టిన ఆడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. కల్వకుర్తి బిజెపి అభ్యర్థి ఆచారి ఈ ఆడియో తాలూకు వార్తను తన ఫేస్ బుక్ వాల్ మీద పోస్టు చేశారు. రేవంత్ రెడ్డి తీరును ఆచారి ఎండగట్టారు. రేవంత్ అధికారులను దుర్భాషలాడటాన్ని ఆచారి ఖండించారు.
అయితే కామన్ పీపుల్ దీనిపై రెండు వైపులా స్పందిస్తున్నారు. రేవంత్ మాట్లాడిన తీరు దారుణం అని కొందరు అంటుంటే, మరి అధికారులు అధికార పార్టీ మెప్పు కోసం ఆరాటపడి ఓవర్ యాక్షన్ చేయడం సమంజసమా అని కొందరంటున్నారు. మరి బట్టలిప్పి కొట్టిస్తా కార్యకర్తలతో అని తీవ్రమైన భాషను కొందరు తప్పుపడుతున్నారు. ఈ ఆడియో పుటేజీ ఎలా లీక్ అయిందన్నది కూడా చర్చనీయాంశమైంది.
రేవంత్ రెడ్డి, అధికారి మధ్య సంభాషణ ఆడియో కింద ఉంది. వినండి.