కర్ణాటకలో కంప్లైట్… ఏపీలో జనసైనికులకు కొత్త టెన్షన్!

సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ దేశవ్యాప్తంగా పలురాష్ట్రల్లో ఎలక్షన్ కోడ్ అమలవుతున్న సంగతి తెలిసిందే. దీంతో… రాజకీయ పార్టీల ఫ్లెక్సీలు, హోర్టింగ్ లు, కటౌట్ లు, పోస్టర్ లను ఇప్పటికే తొలగించారు. రాజకీయ పార్టీలకు సంబంధించిన వారి విగ్రహాలకు ముసుగులు వేశారు! ఈ నేపథ్యంలో ఆయా రాష్ట్రాల్లో ఎన్నికల కమిషన్ కు రకరకాల ఫిర్యాదులు అందుతున్నాయి. ఇందులో తాజాగా అందిన ఒక ఫిర్యాదు జనసైనికులను టెన్షన్ పెడుతుందని తెలుస్తుంది!

వివరాళ్లోకి వెళ్తే… తాజాగా కర్ణాటకలో ఎన్నికల కమిషన్ కు ఒక ఫిర్యాదు అందింది. ఇందులో భాగంగా… కన్నడనాట స్టార్ హీరో శివరాజ్ కుమార్ పోస్టర్స్ ని తొలగించాలని ఫిర్యాదులు వెళ్లివెత్తినట్లు తెలుస్తుంది. అలా అని శివరాజ్ కుమార్ ఏమీ ఈ ఎన్నికల్లో పోటీ చేయడంలేదు. అయితే… ఆయన సతీమణి గీత మాత్రం బరిలోకి దిగుతున్నారు. ఇందులో భాగంగా శివమొగ్గ నియోజకవర్గం నుంచి ఆమె కాంగ్రెస్ పార్టీ తరుపున పోటీ చేస్తున్నారు.

ఇలా తన భార్య ఎన్నికల్లో పోటీ చేస్తుండటంతో… ఆమె తరుపున శివరాజ్ కుమార్ ప్రచారం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన సినిమా పోస్టర్లను కూడా తొలగించాలని.. ఆ ప్రభావం కూడా ఓటర్లపై పడే అవకాశం ఉందని ఈసీకి ఫిర్యాదు చేశారు బీజేపీ నేతలు. దీంతో… స్పందించిన కమిషన్ తగు చర్యలు తీసుకుంటామని తెలిపినట్లు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో… ఒకవేళ కర్ణాటకలో ప్రచారం చేస్తున్న శివరాజ్ కుమార్ పోస్టర్లను తొలగిస్తే… ఏపీలో పవన్ పరిస్థితి ఏమిటి అనేది ఇప్పుడు అసలు ప్రశ్న!

ఏపీలో బీజేపీతో కలిసి పొత్తులో ఉన్న జనసేన అధినేత.. తెలుగులో స్టార్ హీరో. పైగా.. గ్లాసు ఎంత పగిలితే అంత పదునెక్కుతుంది.. గ్లాస్ అంటే సైన్యం.. కనిపించని సైన్యం అనే డైలాగ్స్ తో ఒక ట్రైలర్ ని కూడా రిలీజ్ చేశారు! దీనిపైనా ఈసీకి అందిన ఫిర్యాదుల సంగతి కాసేపు పక్కనపెడితే… కర్ణాటకలో అందిన ఫిర్యాదుకు ఈసీ స్పందించి వాటిని తొలగిస్తే… వేంటనే ఏపీలోనూ అది వర్తించే అవకాశం ఉందనేది జనసైనికుల టెన్షన్ అని అంటున్నారు.

ఒక వేళ ఎన్నికల కమిషన్ రియాక్ట్ అయ్యి.. కర్ణాటకలో రాజ్ కుమార్ పోస్టర్లు, ఏపీలో పవన్ కల్యాణ్ సినిమా పోస్టర్సూ తొలగించమంటే అది కచ్చితంగా సమస్యే అనేది వారి అభిప్రాయంగా ఉందంట. ఆ సంగతి అలా ఉంటే… ఈ లెక్కన చూస్తే టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బాలకృష్ణ పోస్టర్లు కూడా తీసిపారేయాల్సిన పరిస్థితి రావొచ్చనేది మరో టెన్షన్ అంట. ఏది ఏమైనా… కర్ణాటకలో అందినట్లు చెబుతున్న తాజా ఫిర్యాదు మాత్రం ఆసక్తిగా మారింది.. దీనికి ఈసీ ఎలాంటి చర్యలు తీసుకోబోతోందనేది మరింత ఆసక్తిగా మారింది!