ఉక్కు సంకల్పంతో మళ్ళీ రాజకీయ రంగంలోకి చిరంజీవి.?

Chiranjeevi re-entered politics

Chiranjeevi re-entered politics

‘గుర్తుకొస్తున్నాయి..’ అంటూ ‘విశాఖ ఉక్కు – ఆంధ్రుల హక్కు’ ఉద్యమం నాటి రోజుల్ని సినీ నటుడు, మెగాస్టార్ చిరంజీవి గుర్తు చేసుకున్నారు. మాజీ కేంద్ర మంత్రి కూడా అయిన చిరంజీవి, ప్రస్తుతం విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ దిశగా చోటు చేసుకుంటున్న పరిణామాలపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.

ఉక్కు పరిశ్రమను కాపాడుకోవాలంటూ నినదించారు. ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ వ్యతిరేక ఉద్యమానికి తనవంతుగా గొంతు కలిపారు మెగాస్టార్ చిరంజీవి. అయితే, చిరంజీవి స్పందన తర్వాత రాజకీయ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చ మొదలైంది. సోదరుడు పవన్ కళ్యాణ్, బీజేపీతో పొత్తులో వున్నారు గనుక, విశాఖ ఉక్కుపై గట్టిగా మాట్లాడలేకపోతున్నారన్న వాదన వుంది. దానికి భిన్నంగా చిరంజీవి, విశాఖ ఉక్కు కోసం జరుగుతున్న పోరాటానికి మద్దతివ్వడం గమనార్హం. అయితే, నిన్న మొన్నటిదాకా బీజేపీ నేతలతోనూ సన్నహిత సంబంధాలు నడిపిన చిరంజీవి, ఇప్పుడెందుకిలా బీజేపీ నేతృత్వంలోని మోడీ ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నట్టు.? ఆ మాటకొస్తే, ఏపీ బీజేపీ నేతలు కూడా కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థించడంలేదు. ‘పార్టీ వేరు ప్రభుత్వం వేరు..’ అని బీజేపీనే పదే పదే చెబుతూ వస్తోంది. మూడు రాజధానుల విషయంలో కావొచ్చు, మరో విషయంలో కావొచ్చు, బీజేపీకి ఓ ఖచ్చితమైన నిర్ణయమంటూ లేకుండా పోతోంది.. అదే గందరగోళం విశాఖ ఉక్కు విషయంలోనూ నడిపిస్తోంది బీజేపీ.

సరిగ్గా ఈ తరుణంలో చిరంజీవి ట్వీట్ ఏపీ రాజకీయాల్లోనూ, తెలంగాణ రాజకీయాల్లోనూ పెను ప్రకంపనలకు కారణమైంది. ‘అవసరమైతే విశాఖ వెళ్ళి మరీ ఉద్యమానికి మద్దతు ఇస్తాం..’ అని తెలంగాణలోని అధికార పార్టీ తరఫున, ప్రభుత్వం తరఫున మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చిన దరిమిలా, ఆ వెంటనే చిరంజీవి నుంచి కూడా ఉక్కు పోరాటానికి మద్దతు రావడాన్ని ప్రత్యేకంగా చూడాలేమో. రాజకీయాల్లోకి చిరంజీవి రీ-ఎంట్రీ ఇవ్వడానికి ఇదే సమయమన్న చర్చ జరుగుతున్న వేళ, చిరంజీవి ట్వీటుని రాజకీయ కోణంలో చూడలేమని కొందరు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.