చిరంజీవి రాజకీయ విమర్శలు.! ఇప్పుడే ఎందుకు.?

తెలంగాణ ప్రభుత్వం, ‘పద్మవిభూషణ్’ మెగాస్టార్ చిరంజీవిని ఘనంగా సత్కరించింది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహా పలువురు తెలంగాణ మంత్రులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

చిరంజీవితోపాటు ఈ ఏడాది పద్మవిభూషణ్ పురస్కారానికి ఎంపికైన మాజీ కేంద్ర మంత్రి, మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. చిరంజీవి కూడా గతంలో కేంద్ర మంత్రిగా పని చేసిన సంగతి తెలిసిందే.

కాగా, సినీ రంగంలో చిరంజీవి సాధించిన పేరు ప్రఖ్యాతుల గురించీ, సేవా రంగంలో చిరంజీవి ఘనతల్నీ ఈ సందర్భంగా వక్తలు కొనియాడారు. ఇక్కడిదాకా అంతా బాగానే వుంది. కానీ, ఈ వేదికపై చిరంజీవి రాజకీయాలు మాట్లాడటం అందర్నీ విస్మయానికి గురిచేసింది.

రాజకీయాల్లో వ్యక్తిగత విమర్శలు అత్యంత జుగుప్సాకరంగా వుంటున్నాయన్నది చిరంజీవి ఆరోపణ. అది నిజమే కూడా.! చిరంజీవి కూడా ఈ తరహా జుగుప్సాకర విమర్శల్ని ప్రజారాజ్యం పార్టీ అధినేతగా వున్నప్పుడు ఎదుర్కొన్నారు. ఇప్పటికీ వైసీపీ నేత, మంత్రి రోజా లాంటోళ్ళు చిరంజీవిని తూలనాడుతుంటారు.

కొన్నాళ్ళ క్రితం చిరంజీవిని మర్యాదపూర్వకంగా కలిశారు రోజా.. అదీ సకుటుంబ సమేతంగా. మంత్రి పదవి వచ్చిన ఆనందంలో, చిరంజీవి ఇంటికి వెళ్ళారు రోజా. కానీ, ఆ తర్వాత ఆమె చిరంజీవి మీద దారుణమైన విమర్శలే చేశారు. ఆ విమర్శలపై చిరంజీవి అప్పట్లోనే తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.

అయితే, ఇప్పుడు చిరంజీవి కేవలం రోజా మీదనే కాదు, ఇప్పుడున్న రాజకీయాల్లో వ్యక్తిగత దూషణల అంశాన్ని ప్రస్తావిస్తూ, ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. కేవలం వైసీపీ నేతల విమర్శలపైనే చిరంజీవి అభ్యంతరం వ్యక్తం చేశారా.? అదే నిజమైతే, మళ్ళీ రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన చిరంజీవి ఏమైనా చేస్తున్నారా.?

సన్మాన కార్యక్రమంలో రాజకీయాలు చిరంజీవి మాట్లాడారంటే, సమ్‌థింగ్ ఫిషీ.!