ఆకాశం ఊడిపడినా..బ్రహ్మాడం బద్దలైనా టీడీపీతో పొత్తు పెట్టుకునే పరిస్థితుల్లో లేదు బీజేపీ. అందుకు కారణం గత అనుభవాలే. టీడీపీతో దోస్తానం అంటే ? ఎలా ఉంటుందో చంద్రబాబు రుచి చూపించిన సంగతి తెలిసిందే. ఆ దెబ్బకి బీజేపీ- టీడీపీ అంటేనే బెంబేలెత్తిపోతుంది. చంద్రబాబు నాయుడు పేరెత్తితేనే ఆ పార్టీ నేతలు అంతెత్తున లేచిపడతారు. కన్నా లక్ష్మీ నారాయణ అద్యక్షుడి గా ఉన్నంత కాలం కాస్తా..కూస్తో సహకారం దొరికినా సోము వీర్రాజు ఎంట్రీతో సీన్ మొత్తం మారిపోయింది. టీడీపీని పోస్ట్ మార్టం చేయడమే ఎజెండాగా పెట్టుకుని ముందుకెళ్తున్నారాయన. అయినా చంద్రబాబు నాయుడు బీజేపీని కాళ్లా వెళ్లా పడి ఎలాగైనా దారికి తెచ్చుకోవాలని చేయరాని ప్రయత్నాలన్ని చేస్తున్నారు.
నిన మొన్నటి వరకూ బీజేపీని తిట్టిన నేతలే ఇప్పుడా పార్టీ పాట పాడుతున్నారు. సరిగ్గా ఇప్పుడు అంతర్వేది ఘటనను చంద్రబాబు తెలివిగా రాజకీయం చేసి బీజేపీతో పొత్తు కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు మరోసారి బహిర్గతమవుతోంది. అంతర్వేది ఘటనపై అధికార పార్టీపై బీజేపీ ఏ స్థాయిలో విరుచుకు పడిందో తెలిసిందే. ఈ విషయంలో జనసేన, టీడీపీ కూడా ఒకే స్టాండ్ మీద నిలబడ్డాయి. అయితే టీడీపీ మాత్రం ఇదే అదునుగా భావించి బీజేపీతో షేక్ హ్యాండ్ అందుకోవాలని గట్టి ప్రయత్నాలు చేస్తున్నట్లు తాజా పరిస్థితులను బట్టి తెలుస్తోంది. నేటి నుంచి అన్ని సూర్య దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.
సోమవారం శివాలయాల్లోనూ, మంగళవారం ఆంజనేయ స్వామి, కుమార స్వామి ఆలయాల్లోనూ, బుధవారం అయ్యప్ప స్వామి, గణపతి దేవాలయం, గురువారం సాయిబాబా ఆలయం, శుక్రవారం కనక దుర్గమ్మ ఆలయం, శనివారం వైష్ణవ ఆలయల్లోనూ పూజలు నిర్వహించాలని టీడీపీ శ్రేణులతో పాటు రాష్ర్ట ప్రజలకు పిలుపునిచ్చారు. ఏపీ లో ఒక్క హిందు ఆలయాన్ని కూడా వదిలి పెట్టకుండా పూజలు చేసి హిందువుల సత్తా ఏంటో చాటి చెప్పాలని చెప్పకనే చెప్పారు. రాజకీయ నాయకులు మతం విషయంలో చాలా సున్నితంగా వ్యవహరిస్తారు. చంద్రబాబు కూడా ఇప్పటివరకూ అదే చేసుకుంటూ వచ్చారు. కానీ ఇప్పుడు పార్టీ భవిష్యత్ కోసం..బీజేపీ ప్రసన్నం చేసుకోవడం కోసం ఇలా వంతు పాడక తప్పలేదని తేటతెల్లమవుతోంది. మరి ఇలా చేస్తే బీజేపీ మనసు కరిగిపోద్దా…చంద్రబాబుని చంక నెక్కించుకుంటారా? అన్నది చూడాలి.