గండికోటకు కృష్ణానీళ్లు, చంద్రబాబు టార్గెట్ పులివెందులా?

(యనమల నాగిరెడ్డి)

వైస్సార్ సి కంచుకోట పులివెందులకు తామే కృష్ణ నీళ్లు ఇచ్చామని చెప్పి, అక్కడ జగన్ ప్రాబల్యం తగ్గించడానికి చంద్రబాబు ఎంత తహతహ లాడుతున్నాడో చెప్పలేం.  అవుకు నుంచి గండికోటకు నీళ్లు వచ్చిన వెంటనే,  మైలవరం, సర్వారాయసాగర్ లాంటి ప్రాజక్టులను పక్కన పెట్టి, పులివెందులకు నీళ్ళు ఇస్తున్నారట. ఈతొందరలో సరైన నష్టపరిహారం కూడా ఇవ్వకుండా బలప్రయోగంతో ముంపు గ్రామాలను ఖాళీచేయిస్తున్నారు.

 
ఇప్పటివరకూ మెదటి విడత పరిహారంగా 14 గ్రామాలలోని 9098 కుటుంబాలకు 479 కోట్లు మంజూరైంది. ఇటీవల రెండవ విడతగా 8 గ్రామాలకు 600 కోట్ల పరిహారం కావాలని అధికారులు ప్రతిపాదించగా ప్రభుత్వం 8970 ఎకరాల భూమికి,198 కోట్లు మంజూరు చేసింది. అయితే ఈ పరిహారానికి అర్హులను గుర్తించడంలోనూ, వారికి పరిహారం అందించి, పునరావాసం కల్పించడంలోనూ యంత్రాంగం పూర్తిగా విఫలమైంది.2015 నుంచి ప్రతి సంవత్సరం ప్రభుత్వం నీళ్లు వదలాలని నిర్ణయించిన వెంటనే నాయకులు, అధికారులు పల్లెలపై దాడి చేసి, వెంటనే గ్రామాలు ఖాళీ చేయాలని గ్రామస్తులకు చుక్కలు చూపుతున్నారు. 

ప్రస్తుతం ముఖ్యమంత్రి చంద్రబాబు ఇటీవల అవుకు గేట్లు ఎత్తి గండికోటకు రోజుకు 8 వేల క్యూసెక్కుల నీటిని వడలడంతో అధికారులు పల్లెలను ఖాళీ చేయించడానికి గ్రామాలపై పడ్డారు. రైతులకు చెక్ లు చేతిలో పెట్టి వెంటనే ఇళ్ళు ఖాళీ చేయాలని, లేదా ఇళ్ళు కూల్చి వేస్తామని వెంటపడటం, అందుకు బడా నాయకులు మద్దతు పలకడంతో దిక్కుతోచని ముంపువాసులు మరోసారి రోడ్డెక్కారు.
ఉన్న ఫళంగా వెళ్లిపోమంటే తాము ఎలా వెళ్లాలని, ఎక్కడికి వెళ్లాలని వారు ప్రశ్నిస్తున్నారు. అధినేతలు గండికోటకు నీళ్లు వదలడంలో చూపుతున్న ఉత్సాహం ముంపువాసులకు పరిహారంచెల్లించడంలోనూ, పునరావాసం కల్పించడంలోనూ చూపాలని వారు కోరుతున్నారు. అలా కాకపోవడం వల్లనే ఈ కథ 2015 నుంచి పునరావృతం అవుతూ ఉంది.

అవుకు రిజర్వాయర్ నుంచి గండికోట రిజర్వాయర్ కు నీళ్లు విడుదల చేస్తున్న ముఖ్యమంత్రి చందబ్రాబు నాయుడు

ఆర్డీఓ సస్పెన్షన్ 

నష్ట పరిహారం పంపిణీలో నాయకుల జోక్యం అధికంగా ఉండటం, అందుకు అధికారులు తమ వంతు సహకరించడంతో అనేక అవకతవకలు జరిగాయని ఆరోపణలున్నాయి. అప్పట్లో చేతివాటం ప్రదర్శించిన జమ్ములమడుగు ఆర్డీఓ వినాయకం సస్పెండ్ కాగా 70 మంది రైతులపై కేసులు నమోదు చేశారు. నాయకుల మద్ధతుతో వినాయకం అతి తక్కువ కాలంలోనే తిరిగి ఉద్యగంలో చేరగా, 10 మంది రైతులను ఇటీవల పోలీసులు అరెస్ట్ చేశారు.

గండికోట జలాలలో మంత్రి ఆదినారాయణ రెడ్డి, ఎం.ఎల్.సి. రామసుబ్బా రెడ్డి జలవిహారం

ప్రాధమిక సౌకర్యాలకు రైతుల నుండి వసూళ్లు

రైతులకు పునరావాసం ఏర్పరచే ప్రాంతాలలో రోడ్లు, విద్యుత్తు, మంచినీరు లాంటి ప్రాధమిక సౌకర్యాలు కల్పించడం ప్రభుత్వ బాధ్యత. ఇక్కడ మాత్రం అధికారులు రైతుల నుండి ఒక్కొక్కరి నుంచి లక్ష చొప్పున సౌకర్యాల కల్పన కోసం మినహాయిస్తున్నారు. రాయలసీమ కాబట్టే ఈ దౌర్భాగ్యం అంటున్నారు రైతులు. అయితే రైతుల అంగీకారంతోనే తాము ఈ మొత్తం తీసుకుంటున్నామనిఅధికారులు ముక్తాయిస్తున్నారు.

పులివెందులకు నీళ్లివ్వడానికే ఈ తొందర


వైస్సార్ అధినేత జగన్ ప్రాతినిధ్యం వహిస్తున్న పులివెందులకు తామే కృష్ణ నీళ్లు ఇచ్చామని చెప్పి, నియోజకవర్గంలో జగన్ ప్రాబల్యం తగ్గించడానికే టీడీపీ నేతలు ఈ పాట్లు పడుతున్నారని ఆరోపణలు ఉన్నాయి.అందువల్లనే గండికోటకు నీళ్లు వచ్చిన వెంటనే (గాలేరు.. నగరిలో భాగమైన) నీళ్లు ఇవ్వాల్సిన మైలవరం, సర్వారాయసాగర్ లాంటి ప్రాజక్టులను పక్కన పెట్టి పులివెందులపై దృష్టి పెట్టారని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. ముంపు భాదితుల గోడు వినకుండా, ఈ ప్రాజెక్ట్ లకు నీళ్లు వదలకుండా పులివెందులకు మాత్రం నీళ్లిస్తే జిల్లా అంతా టీడీపీకి బ్రహ్మరథం పడుతుందా? అనేది ప్రశ్న. 

వైరిపక్షాల నాయకుల ఐక్యత… పరిహారం మంజూరులో ప్రభుత్వ వివక్ష

జమ్ములమడుగు నియోజకవర్గంలో మెదటి నుంచి ప్రత్యర్ధులు గా ఉన్న మంత్రి ఆదినారాయణరెడ్డి, ప్రభుత్వ విప్ రామసుబ్బారెడ్డి సమైక్యతరాగం ఆలపిస్తూ, ముంపువాసుల కు పరిహారం ఇప్పించడానికే కృషి చేస్తున్నామని చెప్పుకుంటున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు గండికోటకు కృష్ణ నీళ్లు వదిలిన వెంటనే వీరిరువురూ ముంపు ప్రాంతంలో ప్రత్యక్షమై ప్రజలను(తమ వర్గాలకు చెందిన వారిని) వప్పించి మిగిలినవారిపై అధికారుల వత్తిడి పెంచుతున్నారని జనం వాపోతున్నారు.
అయితే తమకు న్యాయం గా రావాల్సిన పరిహారం చెల్లింపచేయడానికి కానీ, కోస్తా ప్రాంతంలో ప్రభుత్వం ఇచ్చిన విధంగా భూములకు పరిహారం ఇప్పించేందుకు కానీ, నిర్వాసితులకు ఇతర ప్రాంతాలలో ముంపువాసులకు ఇచ్చిన విధంగా పునరావాసం కల్పించడానికి కానీ ఈ నాయకులు ప్రత్నించకుండా, నీళ్లు వస్తున్నాయి వెంటనే పల్లెలు ఖాళి చేయాలని తమపై వత్తిడి తేవడం ఎంతమేరకు సమంజసమని వ్వారు ప్రశ్నిస్తున్నారు. “రాజకీయలకోసమైనా” ఈ నాయకులు తమను ఆదుకోవాలని, టీడీపీ అధినేత పులివెందులపై చూపిన శ్రద్దలో సగమైనా తమపై చూపాలని, తమకు ఇతర ప్రాంతాల వారికి ఇచ్చిన విధంగానే పరిహారం ఇవ్వాలని, పునరావాసం కల్పించాలని ముంపువాసులు కోరుతున్నారు.

(బ్యానర్ ఫోటో:అవుకు రిజర్వాయర్ నుంచి గండికోట రిజర్వాయర్ కు  నీళ్లు విడుదల  చేస్తున్న ముఖ్యమంత్రి)

 

 

ఇది కూడా చదవండి

కెసియార్ మూడో కన్ను మీద సోషల్ మీడియా సెటైర్