ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన ప్రసంగంలో స్వచ్ఛాంధ్ర ప్రదేశ్ లక్ష్యంపై కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రతి మూడో శనివారం స్వచ్ఛాంధ్ర కోసం ప్రత్యేకంగా కేటాయించినట్లు తెలిపారు. పరిశుభ్రంగా ఉండే నియోజకవర్గాలను గుర్తించి, ప్రత్యేక అవార్డులు అందజేయనున్నట్లు ప్రకటించారు.
చంద్రబాబు, పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కల్యాణ్ పనితీరును ప్రశంసించారు. పల్లె పండుగ పేరుతో రాష్ట్రవ్యాప్తంగా అన్ని పంచాయతీల్లో ఒకేరోజు జనరల్ బాడీ సమావేశాలు ఏర్పాటు చేసి, అవసరమైన నిధులను మంజూరు చేయడం దేశంలో ఏ రాష్ట్రం చేయలేని ఘనతగా అభివర్ణించారు. ఇది పవన్ కల్యాణ్ నాయకత్వ సామర్థ్యాన్ని ప్రతిబింబిస్తోందని అన్నారు.
అంతేకాక, గతంలో ఫైనాన్స్ కమిషన్ నిధులను దారి మళ్లించడం వల్ల పంచాయతీల అభివృద్ధి ఆగిపోయినట్లు గుర్తుచేశారు. అయితే, పవన్ కల్యాణ్ వాటిని తిరిగి చెల్లించి, సెకండ్ ఇన్ స్టాల్ మెంట్ సైతం తీసుకురావడం గర్వకారణమని చంద్రబాబు తెలిపారు. పంచాయతీ వ్యవస్థ బలోపేతానికి పవన్ కల్యాణ్ నడుము బిగించి పని చేస్తున్నారని ప్రశంసించారు.
అయితే, గ్రామీణ ప్రాంతాల్లో రోడ్ల పరిస్థితిపై సీఎం స్వయంగా అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇంకా కొంత ప్రణాళిక అవసరమని, సంకల్పం ఉంటే మార్గం తప్పకుండా లభిస్తుందని అన్నారు. ప్రభుత్వ లక్ష్యం సఫలమవాలంటే అన్ని శాఖలు కలసి కృషి చేయాల్సిన అవసరం ఉందని చంద్రబాబు తన ప్రసంగం ముగించారు.