“పుష్ప”పై చంద్రబాబు సెల్ఫ్… వాయించి వదులుతున్న వైసీపీ!

“పుష్ప” సినిమాలో నటనకు గాను అల్లు అర్జున్ కు జాతీయ స్థాయిలో అవార్డు వచ్చిన సంగతి తెలిసిందే. ఇండస్ట్రీ జనాలతో పాటు రాజకీయ నాయకులు, వివిద వర్గాల వారూ ప్రస్తుతం బన్నీని అభినందించే పనిలో ఉన్నారు. ఈ సమయంలో చంద్రబాబు ఎంటరయ్యారు. తనదైన శైలిలో సెల్ఫ్ డబ్బా వాయించుకున్నారు.

జాతీయ స్థాయిలో అవార్డు వచ్చినందుకు అల్లు అర్జున్ ని అభినందించిన చంద్రబాబు… ఈ గ్యాప్ లో తన గురించి కూడా కాస్త బలంగానే చెప్పుకున్నారు. పుష్ప సినిమాకు జాతీయ అవార్డు రావడానికి కూడా తానే కారణం అని చెప్పేటంత సాహసం ప్రస్తుతానికి చేయలేదు కానీ… ఆ సినిమాలో కొన్ని చోట్ల తన ఫోటో ఉండటంపై వైసీపీ నాయకులు ఏడుస్తున్నారని చెప్పుకున్నారు.

ఇప్పటికే చంద్రయాన్ – 3 సక్సెస్ అవ్వడంతో ఏపీలో కూడా ఇక చంద్రమే, చంద్రబాబే అని అనుకుంటున్నారంటూ మరింత దిగజారిపోయి మరీ ఒక వర్గం మీడియా కామెంట్లు చేస్తున్న వేళ… తాజాగా పుష్ప సినిమాలో తన ఫోటోలపై బాబు సెల్ఫ్ డబ్బా వేసుకున్నారు.

ఇందులో భాగంగా మైకులముందుకు వచ్చిన బాబు… “పుష్ప సినిమాలో నేను ఉన్నానని, నా ఫోటోని కొన్ని సన్నివేశాల్లో చూపించారని వైసీపీ వాళ్లు ఏడుస్తున్నారు. సినిమాలోని కొన్ని సీన్లలో బ్యాక్ గ్రౌండ్ లో నా ఫోటో ఉంటుంది. మూవీలో చూపించిన టైంలో నేను సీఎంగా ఉన్నానని ఆ ఫోటో పెట్టారా..? లేక, ఎర్రచందనం స్మగ్లర్లను నేను కంట్రోల్ చేశానని నా ఫోటో పెట్టారో తెలియదు” అని చెప్పుకున్నారు.

దీంతో వైసీపీ నేతలు సెటైర్లు పేలుస్తున్నారు. ఇందులో భాగంగా… ఈ చిత్రంలో పోలీసు స్టేషన్, అలాగే సరిహద్దు చెక్ పోస్ట్ లో రెండు సీన్లలో ఆయన ఫోటో ఉంటుంది. ఈ రెండూ కూడా ప్రభుత్వ కార్యాలయాలే కాబట్టి.. ముఖ్యమంత్రి ఫోటో ఉండడం వింత కాదు అని క్లారిటీ ఇస్తున్నారు.

అయితే తాను సీఎంగా ఉన్నప్పుడు ఎర్రచందనం స్మగ్లర్లను కంట్రోల్ చేసినట్లు చెప్పుకోవడంపై కూడా సెటైర్లు పేలుతున్నాయి. ఆ సినిమా స్మగ్లింగ్ ని నిరోధించిన పోలీసు అధికారులకు సంబంధించిన స్టోరీ కాదని.. విచ్చలవిడిగా ఎర్రచందనం అక్రమ రవాణా జరిగిందనే విషయానికి సంబంధించింది అని స్పష్టం చేస్తున్నారు.

కాగా… ఎక్కడ ఏ అద్భుతం జరిగినా అందులో తన పాత్ర ఉందని చెప్పుకోవడంలో చంద్రబాబు ముందుంటారని విపక్షాలు విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. హైదరాబాద్ డెవలప్మెంట్ విషయంలో అయితే… బీఆరెస్స్ నేతలు మందికి పుట్టిన బిడ్డను మా బిడ్డ అనుకుంటారనే స్థాయిలో విమర్శలు చేసిన సంగతి తెలిసిందే!