కొత్త టెన్షన్… జైల్లో చంద్రబాబు నిరసన దీక్ష!

స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో అరెస్టైన టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం సుప్రీంకోర్టులో ఆయన దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ ఈ నెల 3న విచారణకు వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. ఇదే సమయంలో మరో మూడు కేసులకు సంబంధించిన పిటిషన్లు న్యాయస్థానల పరిధిలో ఉన్నాయి!

ఇందులో భాగంగా ఏపీ ఫైబర్ గ్రిడ్, అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్ మెంట్, అంగళ్లు అల్లర్లు వంటి కేసుల విషయంలో ఏపీ సీఐడీ రిట్ పిటిషన్లు దాఖలు చేయగా.. బాబు వాటిపై ముందస్తు బెయిల్ పిటిషన్లు దాఖలు చేశారు. మరోపక్క ఇదే ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్ మెంట్ స్కాం కు సంబంధించిన లోకేష్ కు 41-ఏ నోటీసులు ఇచ్చి, ఈనెల 4వ తేదీ ఉదయం 10 గంటలకు విచారణకు రావాలని కోరారు.

ఈ నేపథ్యలో చంద్రబాబు అరెస్ట్ కు నిరసనగా శనివారం రాత్రి కంచాలు, తపేలాలు, గంటలు మోగిస్తూ.. డప్పులు వాయిస్తూ.. విజిల్స్ ఊదుతూ టీడీపీ శ్రేణులు సందడి చేసిన సంగతి తెలిసిందే. ఊహించని విధంగా ఆ కార్యక్రమానికి సైతం సరైన స్పందన రాలేదని.. కనీసం ఇంట్లో కూర్చుని కూడా బాబు కోసం నిరసన తెలిపే ఆలోచన ప్రజానికం చేయడం లేదని కామెంట్లు వినిపిస్తున్నాయి.

మరోపక్క న్యాయస్థానం రిమాండ్ విధించిన తర్వాత కూడా అక్రమ అరెస్ట్ అని అంటే… అది న్యాయస్థానాలను అవమానించడమే అని, ఇది అతిపెద్ద నేరం అని వైసీపీ నేతలు హెచ్చరిస్తున్నారు. అరెస్ట్ చేసినప్పుడు అక్రమ అరెస్ట్ అన్నారంటే అర్ధం ఉంది కానీ… న్యాయస్థానాలు స్పష్టంగా ఇందులో నేరం జరిగింది అని గ్రహించబట్టే కదా రిమాండ్ కు తరలించారని, అలాంటప్పుడు ఇంకా అక్రమ అరెస్టులు అనడం సరైంది కాదని చెబుతున్నారు!

ఈ సమయంలో నిరసనలు మరింతగా పెంచాలనో.. లేక, బాబు అరెస్ట్ అనంతరం ఢీలా పడిన కేడర్ లో కదలికలు తీసుకురావాలనో తెలియదు కానీ… సోమవారం గాంధీ జయంతి నాడు నిరసన దీక్ష చేపట్టాలని చంద్రబాబు ఫిక్సయ్యారు. ఈయనతో పాటు చంద్రబాబు సతీమణి భువనేశ్వరి కూడా నిరసన దీక్ష చేయనున్నారు.

స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో తన అరెస్టును నిరసిస్తూ టీడీపీ అధినేత చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైల్లో గాంధీ జయంతి నాడు నిరసన దీక్ష చేపట్టనున్నారు. అదే రోజు ఆయన సతీమణి భువనేశ్వరి కూడా రాజమండ్రిలోనే నిరసన దీక్ష చేయనున్నారని నందమూరి బాలకృష్ణ ప్రకటించారు. దీంతో జైల్లో నిరసన దీక్షకు ఆయన ఆరోగ్యం దృష్ట్యా పోలీసులు అనుమతి ఇస్తారా.. లేదా అనేది వేచి చూడాలి!

కారణం… చంద్రబాబుకు 73ఏళ్లు అని, అందువల్ల జైల్లో ఉన్నప్పటికీ ఇంటినుంచే ఆహారం, మెడిసిన్స్ అందించాలాని కోరిన మేరకు అలానే జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నిరసన దీక్ష అని అంటే ఆహారం తీసుకోకుండా చేస్తారా.. లేక, రోజూలాగానే సమయం గడుపుతూ దానికి నిరసన అని నామకరణం చేస్తారా అనేది వేచి చూడాలి!

అదే సమయంలో పార్టీ అధినేత నిరసన నేపథ్యంలో రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో పార్టీ నాయకులు, కార్యకర్తలూ సోమవారం దీక్షలు చేస్తారని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు నమ్మకంగా చెబుతున్నారు.