చంద్రబాబు అరెస్ట్.! చేతులెత్తేసిన వైఎస్ జగన్.!

తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు అరెస్టు వ్యవహారంలో వైసీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేతులెత్తేశారు.! అసలు చేతులెత్తేయడమేంటి.? ఔను, నిజంగానే చేతులెత్తేశారు.!

చంద్రబాబు హయాంలో స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ సహా, చాలా స్కాములు జరిగాయన్నది వైసీపీ ఆరోపణ. అధికారంలోకి వస్తూనే, ఆయా వ్యవహారాల్లో విచారణలు షురూ చేయించారు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. వైసీపీ నేతలే చాలా కేసులు పెట్టారు, ఆయా వ్యవహారాలకు సంబంధించి.

స్కిల్ డెవలప్మెంట్ స్కామ్‌లో చంద్రబాబు అరెస్టయినప్పుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విదేశాల్లో వున్నమాట వాస్తవం. ‘ఇది కక్ష పూరిత రాజకీయం కాదు. ఆయన జైల్లో వున్నా, బయట వున్నా ఒకటే..’ అంటూ పార్టీ ప్రతినిథుల సమావేశంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వ్యాఖ్యానించడం గమనార్హం.

స్కామ్ జరిగిందనీ, చట్టం తన పని తాను చేసుకుపోయిందనీ, ఇందులో రాజకీయ కుట్ర కోణం ఏమీ లేదనీ చెప్పాల్సిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ‘అరెస్టు సమయంలో విదేశాల్లో వున్నా..’ అని చెప్పడం అంటే, ‘నాకేంటి సంబంధం.?’ అని చేతులెత్తేసినట్టే వుంది.

ఏపీ సీఐడీ అధికారులు, ఫక్తు వైసీపీ నేతల్లా మాట్లాడుతున్నారన్న విమర్శలు లేకపోలేదు. ఢిల్లీలో ఏపీ సీఐడీ ప్రెస్ మీట్ సందర్భంగా, వైసీపీ కోసం పనిచేస్తున్న ఐ-ప్యాక్ టీమ్ సభ్యులూ అక్కడే వున్నారు. ఇవన్నీ దేనికి సంకేతాలు.? వైఎస్ జగన్ అరెస్టులో ఎలాగైతే గతంలో రాజకీయ కుట్ర వుందో, చంద్రబాబు విషయంలోనూ అంతే. ఇందులో ఇంకో మాటకు తావు లేదు.

‘మేమే అరెస్టు చేయించాం..’ అని ఇప్పటిదాకా ఘనంగా వైసీపీ చెప్పుకుంది. ‘మాకేంటి సంబంధం.?’ అని వైఎస్ జగన్ స్వయంగా ప్రకటించుకున్నారాయె.! ఇదెక్కడి కన్‌ఫ్యూజన్.?