ఉత్తరాది పార్టీలోకి సిబిఐ మాజీ జెడి లక్ష్మీనారాయణ

సిబిఐ మాజీ జాయింట్ డైరెక్టర్, ఐపిఎస్ అధికారి అయిన లక్ష్మీనారాయణ రాజకీయ అరంగేట్రం త్వరలోనే చేయనున్నట్లు తేలిపోయింది. ఆయన రాజకీయాల్లోకి రావడం కోసమే ఉన్నతమైన ఐపిఎస్ పదవిని త్యాగం చేశారు. వ్యవసాయరంగాన్ని బాగు చేయడం కోసం తన శక్తి వంచన లేకుండా పనిచేస్తానని లక్ష్మినారాయణ ఇంతకాలం చెబుతూ వచ్చారు.

అయితే ఆయన ఒక దశలో రాజకీయాల్లో ఉన్నా లేకపోయినా తాను రైతుల మేలు కోసం శక్తి వంచన లేకుండా పనిచేస్తానని స్పష్టం చేశారు. ఆ దిశగా ఆయన అనేక జిల్లాలో సభలు, సమావేశాలు ఏర్పాటు చేసి రైతులను చైతన్యం చేసే దిశగా కార్యాచరణ చేపట్టారు. తన కుటుంబసభ్యులందరి మద్దతుతోనే తన ఉద్యోగానికి రాజీనామా చేసినట్లు ప్రకటించారు లక్ష్మినారాయణ.

తాను రాజకీయాల్లో ఉంటే వ్యవసాయ శాఖ మంత్రిగా ఉంటానని కూడా ఒక సందర్భంలో మాట్లాడారు. అయితే ఇంతకాలం ఆయన ఏ రాజకీయ పార్టీలోకి వెళ్తారన్నదానిపై వివరణ మాత్రం ఇవ్వలేదు. అసలు రాజకీయాల్లోకి వస్తారా లేదా అన్న మీమాంస కూడా జనాల్లో నెలకొంది. అయితే వాటన్నిటినీ పటాపంచలు చేస్తూ ఆయన త్వరలోనే ఢిల్లీ సర్కారు నడుపుతున్న ఆమ్ ఆద్మీ పార్టీలో జాయిన్ కాబోతున్నట్లు ఒక మీడియా సంస్థకు వెల్లడించారు. 

జగన్ అక్రమాస్తుల కేసు సహా అనేక కేసులను లక్ష్మినారాయణ సిబిఐ లో ఉండగా విచారించారు. అయితే ఆయన రాజీనామా చేయగానే మా పార్టీలోకి రా.. మా పార్టీలోకి రండి అంటూ టిడిపి, బిజెపి, కాంగ్రెస్, జనసేన లాంటి పార్టీలు ఆహ్వానం పంపాయి. ఒక దశలో వైసిపిలోకి కూడా జాయిన్ కావొచ్చని వార్తలొచ్చాయి.

చివరి వరకు ఆయనను పార్టీలో చేర్పించుకునేందుకు బిజెపి ప్రయత్నాలు చేసింది. ఆయనను బిజెపిలోకి తీసుకోవడం ద్వారా ఆంధ్రాలో మైలేజీ కొట్టేయాలని బిజెపి భావించింది. కానీ ఆయన బిజెపి వైపు వెళ్లేందుకు సుముఖత చూపలేదు. అంతిమంగా కేజ్రీవాల్ పార్టీ ఆమ్ ఆద్మీ ని ఎంచుకున్నారు.

ఆమ్ ఆద్మీ పార్టీ దేశ రాజకీయాల్లో ఒక సంచలనం

ఆమ్ ఆద్మీ పార్టీ దేశ రాజకీయాల్లో ఒక సంచలనం. అనతి కాలంలోనే ఆ పార్టీ ఢిల్లీలో అధికారంలోకి వచ్చింది. కుట్రలు కుతంత్రాలు చేసి కొద్దిరోజుల్లోనే ఆ పార్టీని అధికారం నుంచి దింపేసింది ప్రతిపక్ష బిజెపి. ముందుగా కాంగ్రెస్ సపోర్ట్ తో ఆ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. కానీ  ప్రభుత్వం రద్దు కావడంతో తర్వాత జరిగిన ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ క్లీన్ స్వీప్ చేసింది. 70 అసెంబ్లీ స్థానాలున్న ఢిల్లీలో 67 స్థానాలు గెలిచి ప్రతిపక్షం అనేదే లేకుండా చేసింది. కేవలం ప్రతిపక్ష బిజెపి మూడు సీట్లకే పరిమితమైంది. పార్టీ అధినేత కేజ్రీవాల్ అయితే ఏకంగా ముఖ్యమంత్రి మీదే పోటీ చేసి ఆమెను మట్టి కరిపించి రికార్డు నెలకొల్పారు. 

దేశంలో ఉన్న సాంప్రదాయ పార్టీలన్నీ అవనీతి అక్రమాల్లో మునిగితేలుతున్నాయి. ఏ పార్టీకి చూసినా మరకలు, మచ్చలే ఉన్నాయి. జనాలు సాంప్రదాయ పార్టీలను ఈసడించుకునే పరిస్థితి వచ్చింది. ఈ పరిస్థితుల్లో ఢిల్లీలో పురుడు పోసుకున్న ఆమ్ ఆద్మీ పార్టీ చీపురు గుర్తుతో గబ్బు రాజకీయాలను ఊడ్చే ప్రయత్నం చేసింది. అనేక విషయాల్లో ప్రత్యామ్నాయాలు చూపగలిగింది. జనాలే ఎజెండాగా పాలన సాగిస్తున్నది.

నిత్యం నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం తో వైరం నడుస్తున్నా ఆమ్ ఆద్మీ పార్టీ నిలదొక్కుకుంటున్నది. ఆర్థిక వనరులు లేకపోయినా, లా అండ్ ఆర్డర్ పవర్ చేతిలో లేకపోయినా పాలన కొత్త పుంతలు తొక్కిస్తున్నది. ఈ పరిస్థితుల్లో మాజీ జెడి లక్ష్మీనారాయణ ఆ పార్టీలో చేరారు. అరవింద్ కేజ్రీవాల్ అఖిల భారత సర్వీసు అధికారిగా పనిచేయడం, ఈయన కూడా ఆల్ ఇండియా సర్వీసు అధికారిగా పనిచేసి రాజకీయాల్లోకి రావడం ఇక్కడ గమనార్హం.

వారికి, లక్షీనారాయణకు ఉన్న తేడా ఇదే :

లక్ష్మీనారాయణ రాజకీయాల్లోకి రావాలని నిర్ణయమైతే తీసుకున్నారు. కానీ ఆయన ఎంచుకున్న పార్టీ మాత్రం ఇక్కడ ఇప్పటివరకు కనీసం ఉనికిలో కూడా లేదు. అటువంటిది ఆయన తెలుగు రాష్ట్రాల్లో పవర్ కు ఏమాత్రం దగ్గర లేని రాజకీయ పార్టీని ఎంచుకున్నారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన అనేక మంది ఆల్ ఇండియా సర్వీసు అధికారులు రాజకీయాల్లోకి వచ్చారు. వారంతా అధికారంలోకి రాబోతున్న పార్టీల్లో కొందరు చేరితే ఆల్ రెడీ అధికారంలో ఉన్న పార్టీల్లోకి కొందరు చేరారు. కానీ రాజకీయాల్లో విలువలు ఉండాలని ఆకాంక్షించే లక్ష్మీనారాయణ మాత్రం ఆమ్ ఆద్మీ పార్టీని ఎంచుకున్నారు. పవర్ ముఖ్యం కాదన్న ఆలోచనతోనే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు కనబడుతున్నది.  

మొత్తానికి తెలుగు రాష్ట్రాల్లో నీతి, నిజాయితీ కలిగిన వారు, అవినీతికి దూరంగా ఉన్న విద్యాధికులు ఆమ్ ఆద్మీ పార్టీకి సపోర్ట్ చేసే చాన్సెస్ ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో లక్మీనారాయణ చేరితే  ఆ పార్టీకి కొంతమేరకు తెలుగు నేల మీద ఊపు రావొచ్చని చెప్పవచ్చు. డబ్బు రాజకీయాలకు అలవాటు పడిన తెలుగు రాజకీయాల్లో ఆమ్ ఆద్మీ లాంటి పార్టీ, లక్ష్మీనారాయణ లాంటి వ్యక్తి ఏమేరకు రాణిస్తారన్నది కూడా చూడాలి.