ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో పిఠాపురం నియోజకవర్గం హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. చాలా కాలం సస్పెన్స్ తర్వాత తాను పోటీ చేయబోయే నియోజకవర్గంపై పవన్ ప్రకటన చేయడంతో… పిఠాపురంలో ఒక్కసారిగా రాజకీయ వాతావరణం వేడెక్కిపోయింది. టీడీపీ కార్యకర్తలు నానా రచ్చ చేశారు! చంద్రబాబు, లోకేష్ ఫ్లెక్సీలు, ఫోటోలు చింపడంతో పాటు.. పవన్ కల్యాణ్ పై తీవ్రస్థాయిలో ఫైరయ్యారు.
దీంతో… పొత్తులోని పార్టీ అధినేత పోటీ చేస్తున్న స్థానంలో ఇలాంటి పరిస్థితి ఎదురవ్వకుండా చూడాల్సిన బధ్యత చంద్రబాబుది అని, ఇది ఆయన ఫెయిల్యూర్ అని వినిపించిన సంగతి తెలిసిందే. అనంతరం… అతితక్కువ సమయంలోనే బాబు.. వర్మ & కో ను కూల్ చేశారు. దీంతో పవన్ కు ఇక టీడీపీ నేతల నుంచి సమస్య లేదనే మాట వినిపిస్తున్నా.. టీడీపీ కార్యకర్తల నుంచి ఎలాంటి మద్దతు ఉండబోతుందనేది ఫలితాలు వచ్చే వరకూ ఆసక్తికరమైన అంశమే.
ఆ సంగతి అలా ఉంటే… గత ఎన్నికల్లో పోటీ చేసిన భీమవరం, గాజువాక నియోజకవర్గాలు కాదని.. పవన్ పిఠాపురంలోనే పోటీ చేయడానికి గల ప్రధాన కారణం అక్కడున్న కాపు ఓటు బ్యాంక్ అత్యధికంగా ఉండటమే అని కథనాలొచ్చిన సంగతి తెలిసిందే. అయితే… తాజాగా ఎన్నికల సంఘం విడుదల చేసిన ఘణాంకాల మేరకు పిఠాపురంలో కాపు ఓటర్లు మాత్రమే కీలకం కాదని తెలుస్తోంది.
అవును… తాజాగా ఎన్నికల సంఘం విడుదల చేసిన ఘణాంకాల ప్రకారం పిఠాపురంలో 2.28 లక్షల ఓటర్లు ఉండగా.. వారిలో పురుషులు 1.13 లక్షలు, 1.14 లక్షల మహిళా ఓటర్లు ఉన్నారు. వీరిలో కాపు ఓటర్లు 28 శాతం కాపు ఓటర్లు ఉన్నారు. ఇక మిగిలన వారిలో 10 శాతం తూర్పు కాపు, 19 శాతం మాల, 10 శాతం శెట్టిబలిజ, 10 శాతానికి కాస్త అటు ఇటుగా ఉన్నారు. ఇదే సమయంలో… రెడ్డి, యాదవ, మత్స్యకారులు, మాదిగలు కూడా గెలుపు ఓటములపై ప్రభావం చూపించనున్నారు.
ఈ నేపథ్యంలో పిఠాపురంలో పవన్ గెలుపు అంత సులువు కాదు అని… కాపులతో పాటు మిగిలిన సామాజికవర్గాల మద్దతు అత్యంత కీలకంగా మారిందని తెలుస్తుంది. పైకి కాపు ఓటర్లు ఎక్కువ అని ప్రచారం జరుగుతున్నా ఎస్సీ, బీసీ ఓటర్లు కాపులకంటే చాలా ఎక్కువ శాతం ఉన్నారు! దీంతో… అన్ని సామాజికవర్గాలనూ పవన్ ఎలా కలుపుకుని పోతారనేది వేచి చూడాలి!
మరోపక్క వైసీపీ అభ్యర్థి వంగ గీత కూడా కాపు సామాజీవర్గానికి చెందిన నేతే అనే విషయం కూడా ఇక్కడ కీలకం. ఇదే సమయంలో పిఠాపురంలో ఇప్పటికే కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ఆపరేషన్ ప్రారంభించారు. అదేవిధంగా ఎమ్మెల్యే పెండెం దొరబాబు వర్క్ స్టార్ట్ చేశారు. ఈ నేపథ్యంలో పిఠాపురంలోని అన్ని సమాజికవర్గాలను కలుపుకునిపోతూ సక్సెస్ అవ్వడం అనేది ఇప్పుడు బిగ్ టాస్క్ అనే చెప్పాలి!!