రాజకీయాల్లో రీ-ఎంట్రీ ఇచ్చే దమ్ము చిరంజీవికి వుందా.?

చల్లకొచ్చి ముంత దాయడమెందుకనేది ఓ సామెత. మెగాస్టార్ చిరంజీవికి రాజకీయాల్లో రీ-ఎంట్రీ ఇవ్వాలనుకుంటే, తమ్ముడు పవన్ కళ్యాణ్ మీద మరీ అంత అభిమానం ఎక్కువైపోతే, ఎంచక్కా జనసేన పార్టీ ద్వారా మళ్ళీ రాజకీయాల్లోకి వచ్చేయొచ్చు. లేదంటే, పవన్ కళ్యాణ్ వెనుకాల రాజకీయంగా వున్న బలం తానేనని బహిరంగంగా ప్రకటించేసుకోవచ్చు. ఎందుకీ దాగుడుమూతలు.?

‘లూసిఫర్’ సినిమాని చిరంజీవి తెలుగులోకి రీమేక్ చేయడం వెనుక రాజకీయ కారణాలు వున్నాయన్న అనుమానాలు గతంలో వ్యక్తమయ్యాయి. అవి నిజమని ఇప్పుడు తేలుతోంది. ఓ సినిమా డైలాగ్‌ని రాజకీయంగా తన అభిప్రాయమన్న కోణంలో ఆడియో రూపంలో ట్విట్టర్ వేదికగా విడుదల చేయడం దగ్గర్నుంచి, ‘పవన్ కళ్యాణ్‌లోని నిబద్ధత నాకు తెలుసు.. నాయకుడిగా పరిపాలన చేయలని ఆశిస్తున్నాను..’ అని చెప్పడం వరకు.. చిరంజీవి తన మనసులో దాచేసిన ఎన్నో విషయాల్ని బయటపెట్టేశారు.

పైగా, ఇప్పుడు కింగ్.. కింగ్ మేకర్.. అనే ప్రస్తావన కూడా తీసుకొస్తున్నారు. 2009 ఎన్నికల సమయంలో చిరంజీవి నడిపిన ప్రజారాజ్యం పార్టీ దగ్గర్నుంచి, ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో నడుస్తున్న జనసేన పార్టీ వరకు.. చిరంజీవి నిజానికి ఏనాడూ రాజకీయాన్ని వదల్లేదు.. వదిలినట్లు కనిపించారంతే.

2014 ఎన్నికల్లోనే చిరంజీవి, జనసేన వైపు నిలబడి.. జనసేనను ఎన్నికల బరిలో దించి వుండాల్సింది. పోనీ, 2019 ఎన్నికల్లో అయినా జనసేన పార్టీకి చిరంజీవి బాహాటంగా మద్దతు ఇచ్చి వుండాల్సింది. చాలా ఏళ్ళు వృధా చేసేశారు చిరంజీవి. రాజకీయాల్లో సమయం చాలా చాలా విలువైనది.
ఏమో, భవిష్యత్తులో జనసేనకు మద్దతిస్తానేమో.. అని చిరంజీవి చెప్పడం కంటే, మద్దతిస్తున్నా.. అని బాహాటంగా ప్రకటించి వుంటే బావుండేదేమో.!