బోరుగడ్డ అలజడి.. వైసీపీకి కొత్త చిక్కులు?

బోరుగడ్డ అనిల్ కుమార్, గత వ్యాఖ్యలు, భూ కబ్జా ఆరోపణలతో వివాదంలో చిక్కుకున్న విషయం తెలిసిందే. వైసీపీకి మద్దతు తెలుపుతూ, ఇతర నాయకులపై తీవ్ర విమర్శలు చేసిన ఆయన, ప్రస్తుతం పోలీసులు విచారణ ఎదుర్కొంటున్నారు. గుంటూరుకు చెందిన ఓ పాస్టర్ ఫిర్యాదుతో బోరుగడ్డను అరెస్ట్ చేసిన పోలీసులు, తదుపరి ఇతర కేసులపై కూడా దర్యాప్తు చేస్తున్నారు.

బోరుగడ్డ పై సోష్‌ల్ మీడియా వేదికగా చేసిన విమర్శలు, మహిళల పట్ల అనుచిత వ్యాఖ్యలు ఆయనపై తీవ్ర ప్రభావం చూపించాయి. ఈ కేసుల కారణంగా ఆయన్ని పలు జిల్లాల పోలీసులు విచారిస్తున్నారు. ఇంతవరకు వైసీపీ నుంచి ఎలాంటి సహకారం అందకపోవడం, న్యాయ పరమైన మద్దతు లేకపోవడంతో బోరుగడ్డ తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు.

తాజాగా, ఆయన వైసీపీ కీలక వ్యక్తులపై ఆరోపణలు చేయడంతో కేసు మరింత సున్నితంగా మారినట్లు తెలుస్తోంది. తాడేపల్లిని కేంద్రంగా చేసుకొని రాజకీయాలు నడిపే ఇద్దరు ముఖ్య వ్యక్తుల సూచనలతోనే తన వ్యాఖ్యలు, బెదిరింపులు జరిగాయని బోరుగడ్డ పోలీసులకు వాంగ్మూలం ఇచ్చినట్టు సమాచారం. ఈ పరిణామం వైసీపీకి నష్టంగా మారే అవకాశం ఉందని అంటున్నారు విశ్లేషకులు.

బోరుగడ్డ అప్రూవర్‌గా మారే సూచనలు కనిపిస్తున్నాయి. ఇలా జరగితే, ఆయన నుండి వెలువడే నిజాలు వైసీపీలో మరింత మందికి చిక్కులు తెచ్చే అవకాశముంది. సోషల్ మీడియా కేసులు, ఇతర ఆరోపణలు పార్టీకి ప్రతికూల ప్రభావం చూపుతాయని అంటున్నారు. ఈ పరిణామాలు వైసీపీకి కొత్త సమస్యల మూలంగా మారే అవకాశం ఉన్నప్పటికీ, చివరికి ఈ వివాదం ఎటువైపు దారితీస్తుందో చూడాలి.