తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు తన అను‘కుల’ మీడియాతో ప్రజల మైండ్ సెట్ మార్చేందుకు ప్రయత్నిస్తుంటారన్నది బహిరంగ రహస్యం. ఆ అను‘కుల’ మీడియాతోనే స్వర్గీయ ఎన్టీయార్‌ని రాజకీయంగా వెన్నుపోటు పొడవగలిగారు చంద్రబాబు.
ప్రజారాజ్యం పార్టీని కూడా చంద్రబాబు ఇలాగే దెబ్బ తీశారు. జనసేన పార్టీపైనా ఇదే టీడీపీ అను‘కుల’ మీడియా సాయంతో విషం చిమ్ముతుంటారు చంద్రబాబు. ఆ టీడీపీ అను‘కుల’ మీడియాని పచ్చ మీడియాగా అభివర్ణించడం తెలిసిన విషయమే. పచ్చ మీడియా అండతో రాజకీయంగా బతికేస్తున్న చంద్రబాబు, అనూహ్యంగా ‘బ్లూ’ మీడియా అంటూ ఆవేశకావేశకాలకు లోనవుతున్నారు.
నిన్న ఓ కార్యక్రమంలో మీడియాపై మండిపడుతూ, ‘ఎవడ్రా..’ అనే స్థాయికి వెళ్ళిపోయారు.. అదీ మీడియా ప్రతినిథుల్ని ఉద్దేశించి. టీవీ9, ఎన్టీవీలను ఉద్దేశించి బ్లూ మీడియాగా అభివర్ణించారు చంద్రబాబు. సాక్షి ఎలాగూ బ్లూ మీడియానే.!
సాక్షి మొదటి నుంచీ వైసీపీ అనుకూలం. కాంగ్రెస్ హయాంలో పుట్టిన సాక్షి.. ఎవరిదో అందరికీ తెలుసు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సొంత మీడియా సాక్షి. సో, సాక్షి నుంచి స్వచ్ఛమైన వార్తల్ని ఆశించలేం.
ఈనాడు, ఆంధ్రజ్యోతి కూడా ‘మేం టీడీపీ కోసమే వున్నాం..’ అని చెబితే సమస్యే వుండదు. ఆ సంగతి పక్కన పెడితే, టీవీ9 మాత్రమే కాదు ఎన్టీవీ కూడా గతంలో టీడీపీ కోసం పని చేశాయి. ఇప్పుడు వైసీపీ వైపు తిరిగాయి. దాన్ని చంద్రబాబు జీర్ణించుకోలేకపోతున్నారు. మీడియాలో యెల్లో వర్సెస్ బ్లూ.. అంటూ కొత్త యుద్ధానికి చంద్రబాబు ఆజ్యం పోస్తున్నారన్నమాట.