చిరంజీవి కోసం బీజేపీ చివరాఖరి ప్రయత్నం.?

కేంద్ర మంత్రి అనురాగ్ ఠాగూర్ హైద్రాబాద్ వచ్చారు. మెగాస్టార్ చిరంజీవిని కలిశారు. మెగాస్టార్ చిరంజీవి అంటే మాజీ కేంద్ర మంత్రి కూడా. చిరంజీవి అవసరం రాజకీయంగా బీజేపీకి బాగానే వున్నట్లు కనిపిస్తోంది. ఈ మధ్యకాలంలో తరచూ బీజేపీ నేతలు చిరంజీవిని కలుస్తున్నారు. ‘నాకు రాజకీయాలపై ఆసక్తి లేదు’ అని చిరంజీవి పదే పదే చెబుతున్నా, లోలోపల ఎక్కడో చిరంజీవికి ఆనాటి ఆ రాజకీయ సరదా ఇంకా అలా అలా కెలుకుతూ వుంటుంది. దాన్ని బీజేపీ అర్థం చేసుకునే వుంటుంది. కాకపోతే, చిరంజీవి కూడా సరైన సమయం కోసం ఎదురుచూస్తుండొచ్చు.

2024 ఎన్నికల్లో చిరంజీవి పాత్ర ఎంత.? అన్నదానిపై ఇప్పుడే ఏమీ చెప్పలేం. కానీ, ఆయన జనసేన తరఫున ప్రచారం చేస్తారంటూ ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ‘నేనైతే రాజీకయాల్లో లేను’ అని చెబుతున్నారు. కానీ, ‘ఏమో, భవిష్యత్తులో నా తమ్ముడికి రాజకీయంగా మద్దతిస్తానేమో..’అంటూ ఆయనే సెలవిచ్చారు.

ఇంతకీ, ఎందుకు కేంద్ర మంత్రి అనురాగ్ ఠాగూర్ నేరుగా చిరంజీవి ఇంటికి వెళ్ళి ఆయనతో మంతనాలు జరిపినట్టు.? అన్నట్టు, ఈ భేటీలో సినీ నిర్మాత అల్లు అరవింద్‌తోపాటు, సినీ నటుడు అక్కినేని నాగార్జున కూడా పాల్గొన్నాడు. సో, కేవలం రాజకీయ అంశమే ఈ భేటీలో చర్చకు వచ్చి వుండకపోవచ్చు.

రాజకీయ చర్చలు కాదని చెప్పేందుకోసం చిరంజీవి వ్యూహాత్మకంగా అక్కినేని నాగార్జునని కూడా రప్పించి వుండొచ్చా.? అబ్బే, అదేం లేదు.. తెలుగు సినిమా కోసమే.. ఈ ప్రయత్నం అన్నది ఓ వాదన. ఏమో, ఏదైనా జరిగి వుండొచ్చు. తెలంగాణలో ఈ ఏడాదే అసెంబ్లీ ఎన్నికలు జరగనుండడం.. వచ్చే ఏడాది ఏపీలో ఎన్నికలు జరగాల్సి వుండడంతో.. చివరాఖరి ప్రయత్నంగా కేంద్ర మంత్రి అనురాగ్ ఠాగూర్, చిరంజీవితో రాజకీయ మంతనాలు జరిపి వుండొచ్చన్నది ప్రముఖంగా వినిపిస్తోన్న వాదన.