చూడబోతే వ్యవహారం అలాగే ఉందనిపిస్తోంది. మొన్నటి ఎన్నికల్లో కనీసం ఒక్క శాతం ఓట్లు కూడా తెచ్చుకోలేకపోయిన బిజెపి నేతలు వచ్చే ఎన్నికల్లో మాత్రం అధికారంలోకి వస్తామనేట్లుగా మాట్లాడుతున్నారు. సరే నేతలెన్ని మాటలు చెప్పినా ఓట్లేయాల్సింది జనాలే కదా ? జనాలకేమో బిజెపికి ఓట్లేసే ఆలోచన లేనట్లే కనిపిస్తోంది. మొన్న జరిగిన ఎన్నికల్లో బిజెపికి వచ్చిన 0.84 శాతం ఓట్లే ఇందుకు నిదర్శనం.
సంప్రదాయంగా పార్టీలో ఉన్న నేతలను నమ్ముకుంటే ఎన్నికల్లో డిపాజిట్లు కూడా రావన్న నిర్ణయానికి వచ్చిన అగ్ర నేతలు ఇతర పార్టీల్లోని గట్టి నేతలపై కన్నేశారు. అందులో భాగంగానే రాయలసీమలోని ఫ్యాక్షన్ రాజకీయాల్లో కీలకమైన కర్నూలు జిల్లాపై దృష్టి పెట్టినట్లే కనిపిస్తోంది.
ఆళ్ళగడ్డ, నంద్యాలలో పట్టున్న మాజీ ఎంపి గంగుల ప్రతాప్ రెడ్డిని పార్టీలో చేర్చుకుంటోంది. ప్రతాప్ రెడ్డి ఇప్పటికే బిజెపిలో కీలక నేతలైన రామ్ మాధవ్, మురళీధరరావుతో చర్చలు పూర్తి చేసుకుని ఎప్పుడు చేరాలో డిసైడ్ చేసుకున్నారట. ఇంతకుముందే మాజీ మంత్రి భూమా అఖిలప్రియ సోదరులు, పై నియోజకవర్గాల్లో పట్టున్న భూమా మహేష్ రెడ్డి, భూమా కిషోర్ రెడ్డిలను కూడా పార్టీలో చేర్చుకున్న విషయం అందరికీ తెలిసిందే.
కర్నూలు జిల్లాలోని ఆదోని నియోజకవర్గం మాజీ ఎంఎల్ఏ మీనాక్షీ నాయుడు తో పాటు కోట్ల కుటుంబంలోని నేతలు కూడా బిజెపితో టచ్ లో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. మొత్తం మీద రాయలసీమలోని ఫ్యాక్షన్ నేతలుగా ముద్రపడిన వారిలో ముందు కర్నూలు జిల్లా నేతలే బిజెపిలో చేరుతున్నారు.
అనంతపురం జిల్లాలోని ధర్మవరం మాజీ ఎంఎల్ఏల వరదాపురం సూరి ఇప్పటికే బిజెపిలో చేరిన విషయం తెలిసిందే. మాజీ ఎంపి జేసి దివాకర్ రెడ్డి సోదరులు, మాజీ మంత్రి పల్లె రఘునాధరెడ్డి రెడ్డి తదితరులు కూడా టిడిపికి రాజీనామా చేసి కమలం పార్టీలో చేరుతారనే ప్రచారం జరుగుతోంది. రాష్ట్రంలో బలపడేందుకు బిజెపి చేస్తున్న ప్రయత్నాలు ఎంత వరకూ సక్సెస్ అవుతాయో చూడాల్సిందే.