ఏది మంచి.? ఏది చెడు.? అన్నదానిపై జనంలో అవగాహన కల్పించాకనే, ప్రభుత్వాలు సున్నితమైన అంశాల విషయమై కీలక నిర్ణయాలు తీసుకోవాల్సి వుంటుంది. కానీ, ప్రస్తుత రాజకీయాల్లో పరిపాలన అంటే, అదొక ‘ఆట’లా తయారైంది అధికార పార్టీలకి. బొత్తిగా అవగాహన లేనట్టు వ్యవహరిస్తున్నాయి అధికారంలో వున్న పార్టీలు. అదే అన్ని అనర్థాలకీ కారణమవుతోంది.
అగ్నిపథ్ మంటలకు ఆజ్యం పోసేలా కేంద్ర మంత్రుల ప్రకటనలు వుంటున్నాయి.. బీజేపీ నాయకుల వివరణలు వుంటున్నాయి. ఈ సమయంలో ఇదా కావాల్సింది.? దేశంలో దాదాపు ఏడు రాష్ట్రాల్లో ఆందోళనలు తీవ్రస్థాయిలో జరిగాయి, జరుగుతున్నాయి. దేశంలో ఇతర రాష్ట్రాలకు ఈ ఆందోళనలు పాకుతున్నాయి.
లోపమెక్కడుందో తెలుసుకునేవరకు, ‘కీలక నిర్ణయాన్ని’ వాయిదా వేయాల్సిన కేంద్రం, ‘మేం ముందుకే వెళతాం.. మీ దిక్కున్న చోట చెప్పుకోండి..’ అన్నట్టు వ్యవహరించడాన్ని ఏమనుకోవాలి.?
తప్పో ఒప్పో.. విధ్వంసాలు జరుగుతున్నప్పుడు కాస్త సంయమనం పాటించాలి. స్టాప్ లుక్ అండ్ ప్రొసీడ్ విధానం ఇలాంటి సందర్భాల్లో బాగా పని చేస్తుంది. కానీ, కేంద్రానికి ఆ సోయ వున్నట్టు కనిపించడంలేదు. మేం, దేశాన్ని ఉద్ధరించేస్తాం.. అంటూ ఇంకా మీసం మెలేసి, తొడలు కొట్టే పనే చేస్తున్నారు కేంద్ర ప్రభుత్వ పెద్దలు.
ప్రపంచం చూస్తోంది.. దేశంలో శాంతి భద్రతలపై ప్రపంచ దేశాల్లో చులకన భావం ఏర్పడితే.. అంతకన్నా దారుణం ఇంకోటుండదు.