తిరుపతి ఉప ఎన్నికను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నభారతీయ జనతా పార్టీ, మిత్రపక్షం జనసేనతో కలిసి ప్రచారాన్ని కనీ వినీ ఎరుగని రీతిలో ఉధృతంగా కొనసాగిస్తున్న విషయం విదితమే. జనసేన బలపరిచిన బీజేపీ అభ్యర్థి, మాజీ ఐఏఎస్ అధికారిణి రత్నప్రభ గెలిస్తే కేంద్ర మంత్రి అవుతారన్న ప్రచారాన్ని కూడా బీజేపీ తెరపైకి తెచ్చింది. ఇంకోపక్క, ఎప్పుడు ఎన్నికలు జరిగినా బీజేపీ – జనసేన కూటమి అభ్యర్థి పవన్ కళ్యాణేనంటూ ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు సహా పలువురు ఏపీ బీజేపీ నేతలు ప్రకటించేశారు. ఇదిలా వుంటే, తిరుపతి ఉప ఎన్నిక తర్వాత బీజేపీ – జనసేన మధ్య స్నేహంలో భాగంగా ఓ కీలకమైన పరిణామం చోటు చేసుకోబోతోందట. జనసేన పార్టీ, ఎన్డీయే ప్రభుత్వంలో చేరబోతోందంటూ తిరుపతి ఎన్నికల ప్రచారంలో కింది స్థాయి బీజేపీ నేతలు, ఓటర్లను ఉద్దేశించి ప్రకటించేస్తున్నారు.
ఇది ఢిల్లీ స్థాయిలో తీసుకున్న నిర్ణయం అనీ, త్వరలోనే ఇందుకు తగ్గ అధికారిక ప్రకటన రాబోతోందనీ కమలం పార్టీకి చెందిన నేతలు, కార్యకర్తలు ప్రచారం చేసేస్తున్నారట. అదే గనుక నిజమైతే, కేంద్ర క్యాబినెట్ పదవి ఎవర్ని వరిస్తుంది.. నాదెండ్ల మనోహర్ విషయంలో జనసేనాని పవన్ కళ్యాణ్ అత్యంత ప్రత్యేకమైన చొరవ చూపిస్తుంటారు. అయితే, పవన్ కళ్యాణ్ స్వయంగా కేంద్ర మంత్రి అయితే బావుంటుందన్న ప్రతిపాదన బీజేపీ అధినాయకత్వం నుంచి వస్తోందట. నిజానికి, గతంలోనే పవన్ కళ్యాణ్ ముందు ఆ ప్రతిపాదన (అంటే, అది 2014 నుంచి 2018 మధ్య నడిచిన వ్యవహారం) బీజేపీ పెట్టినా, పవన్ అందుకు సుముఖత వ్యక్తం చేయలదట.. టీడీపీ కూడా, పవన్ విషయంలో కొంత డ్రామా ఆడిందట. ఈసారి మాత్రం పవన్, బీజేపీ నుంచి అలాంటి ప్రతిపాదన వస్తే వదులుకునే ప్రసక్తే లేదంటున్నారు. పదవి అనేది రాజకీయాల్లో చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. పదవిలో వుంటే, పార్టీలోనూ జోష్ వస్తుందనే అభిప్రాయం జనసైనికుల్లో కూడా వ్యక్తమవుతోందట. అయితే, ఇదంతా నిజమేనా.? అన్నది మాత్రం తేలాల్సి వుంది.