జూనియర్ ఎన్టీయార్‌తో బాలయ్య రాజకీయం.!

నువ్వూ ఓ రాజకీయ నాయకుడివేనా.? నువ్వూ ఓ సినీ ప్రముఖుడివేనా.? నువ్వూ ఓ బాబాయ్‌వేనా.? సోషల్ మీడియా వేదికగా నందమూరి బాలకృష్ణ మీదకు దూసుకెళుతున్న ప్రశ్నల పరంపర ఇది. తెలుగు సినిమా అంతర్జాతీయ ఖ్యాతిని అందుకుంది. తెలుగు పాటకి ఆస్కార్ లభించింది. ఆ తెలుగు సినిమాని తెరకెక్కించిన దర్శకుడ్ని అభినందించి, ఆ పాటకు సంగీతాన్నందించిన సంగీత దర్శకుడ్నీ అభినందించి, పాట రాసిన పాటల రచయితనీ అభినందించిన బాలయ్య.. ఆ పాటలో నటించిన రామ్ చరణ్, జూనియర్ ఎన్టీయార్‌లను మాత్రం లైట్ తీసుకున్నాడు.

బాలయ్య అంటే కేవలం సినీ నటుడు మాత్రమే కాదు, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే కూడా.! ఎంత బాధ్యాయుతంగా వ్యవహరించాలి.? ఎంత పెద్దరికం ప్రదర్శించాలి. నందమూరి కుటుంబానికి చెందిన ఓ నటుడు, ఆస్కార్ వేదికపై సందడి చేశాడు. మొత్తంగా నందమూరి కుటుంబం, తెలుగుదేశం పార్టీ కూడా సంబర పడాల్సిన సందర్భమిది.

రామ్ చరణ్‌ని కూడా అభినందించాల్సి వస్తుందేమోనని బహుశా బాలయ్య, జూనియర్ ఎన్టీయార్ పేరుని తన అభినందన నోట్‌లో పక్కన పెట్టాల్సి వచ్చినట్లుందన్నది కొందరి డౌటానుమానం. అదే నిజమైతే, అంతకన్నా హాస్యాస్పదం ఇంకేముంటుంది.? తెలుగుదేశం పార్టీ పగ్గాల్ని జూనియర్ ఎన్టీయార్ చేపట్టాలన్న డిమాండ్లు పెరుగుతున్న దరిమిలా, అబ్బాయ్ జూనియర్ ఎన్టీయార్ అంటే అస్సలు పొసగడంలేదు బాలయ్యకి. అదే అసలు కారణం.. లేకపోతే, మొహమాటానికైనా తన అభినందన నోట్‌లో జూనియర్ ఎన్టీయార్ పేరుని ప్రస్తావించి వుండేవాడు బాలయ్య.