హిందుపురం నుండే బాలకృష్ణ పోటీ..ఏమవుతుందో ?

మొత్తానికి హిందుపురం అసెంబ్లీ నియోజకవర్గంలో పోటీపై స్పష్టత వచ్చేసింది. రాబోయే ఎన్నికల్లో మళ్ళీ నందమూరి బాలకృష్ణే పోటీ చేస్తారని చంద్రబాబు తేల్చేశారు. మొన్నటి వరకూ హిందుపురంలో పోటీ చేయబోయే అభ్యర్ధిపై రకరకాల ఊహాగానాలు ప్రచారం జరిగిన విషయం అందరికీ తెలిసిందే.

హిందుపురం అసెంబ్లీ నుండి బాలకృష్ణను పోటీ చేయించటానికి చంద్రబాబు ఇష్టపడటం లేదని బాగా ప్రచారం జరిగింది. దాంతో చంద్రబాబే పోటీ చేస్తారని కాదు లోకేష్ పోటి చేయబోతున్నారని పార్టీలో కూడా చర్చ జరిగింది. చివరకు బాలకృష్ణే మళ్ళీ పోటీ చేయబోతున్నారని చంద్రబాబు స్పష్టం చేయటంతో ప్రచారానికి తెరపడినట్లే.

అయితే, ఇక్కడే ఓ సమస్యుంది. నియోజకవర్గంలో బాలయ్య పై విపరీతమైన వ్యతిరేకత ఉంది. ఏనాడు నియోజకవర్గంలోని సమస్యలపై బాలకృష్ణ దృష్టి పెట్టింది లేదు. గెలిచిన కొత్తల్లో బాలయ్య చెప్పిన సమస్యలపై ఉన్నతాధికారులే చొరవతీసుకుని అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. నియోజకవర్గానికి రాకపోవటం, నేతలకు అందుబాటులో లేకపోవటం లాంటి వాటివల్ల నేతలతో బాలయ్యకు బాగా గ్యాప్ వచ్చేసింది. దాంతో హిందుపురం నియోజకవర్గంలో పార్టీ ఇమేజి బాగా గబ్బుపట్టిపోయింది. మరి ఇటువంటి నేపధ్యంలో మళ్ళీ బాలకృష్ణే పోటీ చేస్తే ఫలితం ఎలాగుంటుందో చూడాల్సిందే.