తెలంగాణా ముఖ్యమంత్రి కెసిఆర్ పొలిటికల్ ఎన్ కౌంటర్లలో అసాధ్యడు. రాజకీయ దాడి చేయడంలో ఆయన దగ్గిర ఉన్న ఆయుధాలన్నీ చాలా పదునైనవి. ఇపుడలాంటి పదునైన ఆయుధంతో ప్రధాని మోదీ మీద ఆయన దాడి చేశారు.
బిజెపి వాళ్లు చాలా చాలా పవిత్రంగా భావించే సర్జికల్ స్ట్రయిక్ రొటీన్ అని కొట్టి పడేశారు. ఎక్కడ కొడితే బిజెపి మైండ్ బ్లాక్ అవుతుందో అక్కడ కొట్టారు కెసియార్.
దేశభక్తి భాషలోకి బిజెపి వాళ్లు దేశభక్తి డిక్షనరీలో చేర్చిన కొత్త మాట సర్జికల్ స్ట్రయిక్. ఈ మాటతో వాళ్లు జనంలో దేశభక్తి పూనకం తీసుకురావాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అందుకే ఈ పవిత్రమయిన సర్జికల్ స్ట్రయిక్ అనే మాట ప్రధాని దగ్గిర నుంచి గల్లీ లీడర్ దాక ఒక మంత్రంగా వాడుకుంటున్నారు.
అలాంటి దాన్ని కెసియార్ రొటీన్ అని కొట్టి పడేశారు. పోబే, మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్నపుడు యుపి ఎ ప్రభుత్వం 11 సార్లు సర్జికల్ స్ట్రయిక్ జరిగిందని, అపుడు తాను మంత్రిగా ఉన్నానని ‘నేను సాక్ష్యం’ అన్నట్లు చెప్పారు.
ఇది రాహుల్ గాంధీయో, మమతా బెనర్జీయో,ఫారూక్ అబ్దుల్లాయో చెబితే అనుమానించాలి.చెప్పింది కెసియార్. కెసియార్ ఎన్డీయే లో కనిపించని సభ్యుడని ప్రచారం. మోదీ, కెసియార్ కలసి ఆంధ్రలో చంద్రబాబు ను ఓడించాలని చూస్తున్నారని ఆయన రోజూ చేసే ప్రచారం. ఇలాంటి కెసియార్ ఈ సర్జికల్ స్ట్రయిక్ ను ప్రశ్నించారు.
‘సాధారణంగా సర్జికల్ స్ట్రయిక్ చేశాక దాని గురించి బయటపెట్టరు. ఎందుకంటే అది వ్యూహాత్మక దాడి. అయితే, మోదీ ఈ దాడి గురించి తెగ చెప్పుకుంటున్నరు. ఒక్క దాడిలో 300 మంది చచ్చిపోయారని ఒకటే ప్రచారం. ఒక్కడు కూడా చచ్చింది లేదు, చీమ కూడా చావలేదుపో అని మసూద్ అజార్ అంటున్నాడు.స్టయిక్స్ ఫోటోలు చూపి ప్రచారం చేసుకుంటారా, ఇదేనా మీ పరిపాలన,దేశాన్ని నడిపించేది ఇలాగేనా,’అని కెసియార్ మిర్యాల గూడలో జరిగిన ప్రచార సభలో కడిగేశారు.
కెసియార్ కు ఇంత కోపం ఎందుకొచ్చిందంటే మహబూబ్ నగర్ జిల్లా భూత్ పూర్ లో నిన్న మోదీ ఒక బహిరంగ సభలో ప్రసంగించారు. అక్కడ కెసియార్ మీద, కుటంబ పాలన మీద, ఎంఐఎంతో కెసియార్ దోస్తీ చాలా జోకులేశారు,చురకలంటించారు.

రాష్ట్రం నిండా కెసియార్ కుటుంబసభ్యులు, కొడుకలు, కూతుళ్లు, అల్లుళ్లు, మేనల్లుళ్లు పదవుల్లో ఉన్నారని, ఎంఐఎం టిఆర్ ఎస్ దోస్తీ ప్రజల కోసం కాదు, వారి కుటుంబాల కోసమని మోదీ చరకలేశారు.
అంతేకాదు, కెసియార్ జ్యోతిషం బలహీనత ను కూడా మోదీ వదల్లేదు.
ఏప్రిల్ ,మేలలో మోదీ స్టార్ మిళమిళ వెలిగిపోతూ ఉంటుందని అపుడు అసెంబ్లీ ఎన్నికలు, పార్లమెంటు ఎన్నికలు ఒకే సారి వస్తే కొంపమునుగుతుందని జ్యోతిష్యుడు చెప్పితే భయపడి అసెంబ్లీ ఎన్నికలను ముందకు జరుపుకున్నారని మోదీ అన్నారు. మోదీ అంటే కెసియార్ కు భయం అన్నారు.
అంతేనా, కాదు, ఇంకా చాలా చెప్పారు.
అసలు కెసియార్ ప్రజల తరఫున కాదు, జ్యోతిషుడి తరఫున పాలన సాగిస్తున్నారని అన్నారు.కెసియార్ కుటుంబ పాలనకు ప్రతిరూపమని, ఆ లక్షణం ఆయన కాంగ్రెస్ నుంచి సంక్రమించిందని మోదీ చెప్పారు.
అయితే, మోదీ గుజరాతి యాసలో సాగిన హిందీ ప్రసంగం జనానికి అంత బాగా అర్థం కాలేదు. అర్థమయితే మాత్రం మోదీ ఎలా కెసిఆర్ ను ఎలా గిల్లుకున్నారో అర్థమవుతుంది. అందుకే కెసిఆర్ మిర్యాల గూడలో సర్జికల్ స్ట్రయిక్ పేరుతో మోదీని ఉతికేశారు.
ఎక్కడ కొడితే దిమ్మతిరుగుతుందో అక్కడ కొట్టారు.
తమాషా ఏంటంటే, భాష ప్రయోగించడంలో మోదీ, కెసిఆర్ లు సరిసమానులే. ఇద్దరికి భాషను,హావభావాలను ఉపయోగించి ఆ భాష తీవ్రతను పెంచే విద్య బాగా తెలుసు.
అయితే, ఎక్కడ చిక్కొచ్చిందంటే, తెలుగు వాళ్లకి హిందీరాదు. మోదీ గుజరాతి యాసలోసాగిన హిందీ ప్రసంగం అర్థంకాదు. అందుకేమోదీ ఇలా చురకలేస్తున్నా జనం లో పెద్ద స్పందన లేదు. దానికి తోడు మోదీ సభకు పెద్దగాజనాన్ని తోల లేకపోయారు. మోదీ సభకు హైవే మీద వున్న భూత్ పూర్ అనువయిన ప్రదేశం కాదు.
ఇక కెసిఆర్ తెలంగాణ నడిబొడ్డున నిలబడి మాట్లాడారు. దంటులాగా సన్నగా ఉండే కెసియార్ నాలుక బాణంలాగా పదునుగా ఉంటుంది. ఆయన భాష జనం భాష. చుట్టూర విపరీతమయిన జనం. నిన్న మోదీ మాట్లాడిన తర్వాత మూడు నాలుగు గంటల్దాకా భూత్ పూర్ స్పీచ్ ఎక్కడ ప్రచరితం కాలే. అంతా ఆయన ఓదిషాలో చేసిన ప్రసంగమే వాడుకున్నారు.
కెసియార్ చక్కటిభాషలో జానపదాలతో మాట్లాడుతూంటే తెలుగువాళ్లందరికి లైవ్ వెళ్లిపోయింది. సోషల్ మీడియా దేశభక్తుల దెబ్బకు భయపడి చాలా మంది బాలాకోట్ సర్జికల్ స్ట్రయిక్ మీద ప్రశ్నలడగటానికి జంకే వారు. ప్రశ్నవేస్తే ఇంకేమన్నా ఉందా?
ఇపుడు కెసియార్ అంతటి నాయకుడు, బాహుబలి మోదీ గాలి తెలంగాణ మీద సోకకుండా ఇన్సులేట్ చేసిన వాడు, బాలాకోట్ మీద సర్జికల్ స్ట్రయిక్ మీద మాట్లాడుతూ, ,‘పోబే నేనున్నపుడు యుపి ఎ ప్రభుత్వం 11 సార్లు సర్జికల్ స్ట్రయిక్స్ చేసింది. అందులో గొప్పేముంది. దాన్ని వాడుకుని ఓట్లు కొట్టేయాలని చూస్తున్నారు.,’ అనేశారు.
కెసియార్ దేశభక్తిని శంకిస్తారా?
