స్వర్గీయ నందమూరి తారకరామారావు రాజకీయంగా వెన్నుపోటుకు గురయ్యారన్నది బహిరంగ రహస్యం. ఆయన చనిపోయి చాలా ఏళ్ళవుతోంది. రాజకీయ వెన్నుపోటు నేపథ్యంలో తీవ్ర మనస్థాపానికి గురైన నందమూరి తారక రామారావు, తన చివరి రోజుల్ని అత్యంత హృదయ విదారకంగా గడిపారనడంలో ఎవరికీ ఎలాంటి సందేహాల్లేవ్.
తన అల్లుడే తనను వెన్నుపోటు పొడిచాడని అప్పట్లో స్వర్గీయ ఎన్టీయార్ స్వయంగా చెప్పారు. చంద్రబాబుని ‘జామాత దశమగ్రహ’ అని కూడా అభివర్ణించారు ఎన్టీయార్. కానీ, ఇప్పుడు సీన్ మారింది.
చంద్రబాబుకి స్వయానా ఆ స్వర్గీయ ఎన్టీయార్ తనయుడు నందమూరి బాలకృష్ణ బాసటగా నిలిచారు. చంద్రబాబు పంచన చేరినప్పుడే, ఆ విషయం స్పష్టమైపోయిందనుకోండి.. అది వేరే సంగతి. కానీ, ‘ఆహా’ ఓటీటీలో ‘అన్‌స్టాపబుల్’ అనే టాక్ షో వేదికగా, చంద్రబాబుని వెనకేసుకొచ్చారు నందమూరి బాలకృష్ణ.
ఇది మామూలు పోటు కాదు సుమీ.! ఆనాటి ఆ సంఘటనల గురించి ఈ టాక్ షోలో ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు చంద్రబాబు, బాలకృష్ణ. ‘ఆ రోజు మనం ముగ్గురం వెళ్ళాం.. కుటుంబ సభ్యులుగా. మరో ఇద్దరు వచ్చారు. ప్రస్తుతం మనిద్దరమే జీవించి వున్నాం. రాజకీయమైతే నువ్వే మాట్లాడాలని ఎన్టీయార్ అనడంతో, మీరిద్దరూ (బాలకృష్ణ, ఎన్టీయార్) బయటకు వెళ్ళారు. లోపల నేను ఎన్టీయార్ కాళ్ళు పట్టుకుని బతిమాలాను. కానీ, ఆయన వినలేదు..’ అని చెప్పుకొచ్చారు చంద్రబాబు.
‘ఔను, అది నిజమే.. దర్శకత్వం, నటన.. రెండూ చేసేటప్పుడు, దర్శకుడ్ని నటుడు డామినేట్ చేయకూడదని నాన్నగారికి నేనే చెప్పాను. రాజకీయాల్లోనూ అదే జరిగింది. నాయకుడ్ని వ్యక్తిగత ఆందోళన డామినేట్ చేసింది..’ అంటూ నింద తన తండ్రి ఎన్టీయార్ మీద వేసేశాడు బాలయ్య.
‘అది తప్పు..’ అని చెప్పడానికి హరికృష్ణగానీ, ఎన్టీయార్‌గానీ జీవించి లేరిప్పుడు. సో, వెన్నుపోటులో చంద్రబాబు, బాలకృష్ణ, హరికృష్ణ.. ఈ ముగ్గురూ వున్నట్లు తేలిపోయిందన్నమాట.