యాంకర్లకు బ్యాడ్ న్యూస్… నిన్న లిసా – నేడు మాయ!

అధునాతన సాంకేతిక పరిజ్ఞానం రోజురోజుకు విస్తరిస్తోన్న సంగతి తెలిసిందే. దీంతో ఇప్పటికే మనుషులు మాన్యువల్ గా చేయాల్సిన పనులను కంప్యూటర్లు, యంత్రాల సహాయంతో చేస్తున్నారు. ఇందులో భాగంగా తాజాగా కృత్రిమ మహిళా యాంకర్స్ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

ఇప్పటికే చాట్ జిపిటి ద్వారా రాయడం, చదవడం వంటి అనేక పనులను సునాయాసంగా చేసేస్తుంటే.. ఇప్పుడు కృత్రిమ మేధ సహాయంతో యాంకర్లను కూడా టెలివిజన్ స్క్రీన్ మీద తీసుకు వస్తున్నారు. ఇందులో భాగంగా… తాజాగా ఒడిశాకు చెందిన ఓటీవీ కృత్రిమ మేథ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) సహాయంతో ఓ న్యూస్ యాంకర్ ను రూపొందించింది. ఈమెకు లిసా అని నామకరణం కూడా చేసిన సంగతి తెలిసిందే.

ఇదే సమయంలో తాజాగా తెలుగు యాంకర్ మాయ కూడా తెరపైకి వచ్చింది. అవును.. ఒడిశాలోని ఓ ప్రైవేట్ న్యూస్ ఛానల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పవర్డ్ వర్చువల్ న్యూస్ యాంకర్ లిసా ను రూపొందించి, లిసా తో వార్తలను చదివిస్తోండగా… ఇక ఇదే బాటలో తెలుగు మీడియాలో బిగ్ టీవీ సంచలనానికి తెరతీసింది. ఇప్పటి వరకు ఏ తెలుగు టీవీ ఛానల్ లో లేనివిధంగా బిగ్ టివి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో న్యూస్ యాంకర్ ను రూపొందించింది.

బిగ్ టీవీ రూపొందించిన వర్చువల్ న్యూస్ యాంకర్ కు మాయ గా నామకరణం చేశారు. ఈమె తెలుగులో న్యూస్ చక్కగా స్పష్టంగా చదువుతోంది. ఈ వర్చువల్ న్యూస్ యాంకర్ చక్కని కట్టు, బొట్టుతో అందంగా ఉంది. న్యూస్ యాంకర్ లకు పోటీగా వార్తలు చదువుతుంది. ఈ వర్చువల్ యాంకర్ మాయ ను తెలుగులో వార్తలు చదివేలా ప్రోగ్రామ్ చేశారు.

అయితే ఇలా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా న్యూస్ ఛానల్స్ యాంకర్లను రూపొందిస్తున్న క్రమంలో.. యాంకర్ల జీవనోపాధి దెబ్బతినే ప్రభావం కనిపిస్తుందని అంటున్నారు. ఇప్పటికే చాలామంది నిరుద్యోగంతో ఇబ్బంది పడుతున్న ఈ దశలో… ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరింత నిరుద్యోగులను పెంచే ప్రమాదం ఉన్నట్లుగా అనుమానం వ్యక్తమవుతోంది. ఈ సమయంలో టెక్నాలజీ అభివృద్ధి చెందుతున్నందుకు సంతోషపడాలో.. లేక, మానవ వనరుల వినియోగం తగ్గి పోతున్నందుకు బాధ పడాలో అర్థం కాని పరిస్థితి ప్రస్తుతం కనిపిస్తుందని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.