ప్రముఖ నటుడు, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌తో పొత్తు కోసం తెలుగుదేశం అర్రులు చాస్తోంది. పవన్ కల్యాణ్ తన వైఖరిని కుండబద్దలు కొట్టినప్పటికీ.. తెలుగుదేశం మాత్రం తన ప్రయత్నాలను మానుకోలేదు. తాజాగా- మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ చేసిన వ్యాఖ్యలు దీనికి నిదర్శనం. రాష్ట్రం కోసం చంద్రబాబు నాయుడు ఒంటరిగా పోరాడుతున్నారని, పవన్ కల్యాణ్‌కు ఆయనకు అండగా నిలవాలని నారాయణ అభిప్రాయపడ్డారు.
మంత్రి నారాయణ, పవన్ కల్యాణ్ ఒకే సామాజిక వర్గానికి చెందిన వారు. అందుకే- నారాయణను చంద్రబాబు రంగంలోకి దించారని భావిస్తున్నారు. జనసేనకు తాను వ్యతిరేకం కాదని, రాష్ట్ర ప్రయోజనాల కోసం మోడీపై తాను చేస్తోన్న పోరాటానికి కలిసి రావాలని స్వయంగా చంద్రబాబే.. పవన్ కల్యాణ్‌ను ఆహ్వానించారు.
దీనిపై పవన్ కళ్యాణ్ ఓ స్పష్టమైన ప్రకటన చేశారు. వామపక్షాలతో తప్ప తాము ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోబోమని, 175 స్థానాల్లో పోటీ చేస్తామనీ క్లారిటీ ఇచ్చారు. అయినప్పటికీ- తెలుగుదేశం నాయకులు పవన్ కల్యాణ్ ఆపన్న హస్తం కోసం ఎదురు చూస్తున్నారు. పవన్ కళ్యాణ్ నిజ నిర్ధారణ కమిటీ వేసి రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సిన లెక్క దాదాపు 75 వేల కోట్ల రూపాయలుగా తేల్చారని, ఎన్నికల సమీపించిన సమయానికి మౌనం దాల్చడం సమంజసం కాదని నారాయణ అన్నారు.పవన్ కల్యాణ్ తమతో కలిసి వస్తారా? లేదా? అనేది ఆయన ఇష్టమని చెప్పుకొచ్చారు.
నిజానికి- పవన్ కల్యాణ్ పవర్ ఏమిటో తెలుగుదేశం పార్టీకి అనుభవమే. 2014లో పవన్ కల్యాణ్‌తో జట్టు కట్టి టీడీపీ రాజకీయంగా లబ్ది పొందగలిగింది. పవన్ సామాజిక వర్గానికి చెందిన ఓటుబ్యాంకును ఆకట్టుకోగలిగింది తెలుగుదేశం. కాపుల రిజర్వేషన్ల కోసం పోరాడుతున్న ముద్రగడ పద్మనాభం తెలుగుదేశానికి వ్యతిరేకంగా ఉన్నారు.
ఆయన వల్ల కోల్పోయిన ఆ సామాజిక వర్గ ఓటు బ్యాంకును పవన్ కల్యాణ్ ద్వారా భర్తీ చేసుకోవాలనేది తెలుగుదేశం వ్యూహం. 2014 ఎన్నికల్లో తాము అధికారంలోకి రావడానికి ప్రధాన కారకుడిగా ఉన్న పవన్ కల్యాణ్‌ను వదులుకోవడానికి తాము ఏమాత్రం సిద్ధంగా లేమని కూడా టీడీపీ నాయకులు `ఆఫ్ ది రికార్డ్`గా చెబుతున్నారు.