కేంద్రం వడ్డనకే అల్లాడుతుంటే జగన్ కూడా స్టార్ట్ చేశారు 

AP government hikes Petrol, Diesel rates

కరోనా కష్టాలతో పనులు లేక నలిగిపోతున్న ప్రజల మీద ప్రభుత్వాలు మరింత భారాన్ని మోపుతున్నాయి.  ప్రధాన వాడుక వనరు పెట్రోల్, డీజిల్ ధరలు పెంచుతూ సామాన్యుడి నడ్డి విరుస్తున్నాయి.  కరోనా లాక్ డౌన్ కారణంగా ప్రభుత్వ ఆదాయం పడిపోవడంతో కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలను ప్రతి రోజూ పెంచుతూ పోయింది.  ఒకేసారి పెంచితే వ్యతిరేకత వ్యక్తమవుతుందని రోజుకు కొంచెం కొంచెం పెంచుకుంటూ పోయింది.  దీంతో గత నెలన్నరలో పెట్రోల్ మీద రూ.10, డీజిల్ మీద రూ.11 పెరిగింది.  దీంతో సామాన్య ప్రజానీకం మీద భారం మరింత పెరిగింది. 

 
ఈ మోతతోనే అల్లాడుతుంటే మేము కూడా ఉన్నామంటూ ఏపీ ప్రభుత్వం కూడా వడ్డన స్టార్ట్ చేసింది.  లీటరు పెట్రోల్ పై రూ.1.24, లీటరు డీజిల్‌ పై 97 పైసలు అదనపు వ్యాట్‌ పెంచుతూ సోమవారం వాణిజ్య పన్నుల శాఖ ఉత్తర్వులు జారీచేసింది.  అర్ధరాత్రి నుంచే ఈ ధరలు అమలులోకి వచ్చాయి.  ప్రస్తుతం లీటరు పెట్రోల్ మీద 31శాతం వ్యాట్‌, రూ.2.76 అదనపు వ్యాట్‌ వసూలు చేస్తున్న ప్రభుత్వం ఇప్పుడు అదనపు వ్యాట్‌ను ఒకేసారి రూ.4 చేసింది.  డీజిల్‌పై 22.25శాతం వ్యాట్‌, రూ.3.07 అదనపు వ్యాట్‌ ఉండగా ఇప్పుడు దాన్ని రూ.4 చేసింది.  ఈ పెంపుతో రవాణా ఖర్చు పెరిగి నిత్యావసరాల ధరలు కూడా పెరుగుతాయి.  
 
ఇలా ఒకేసారి అధిక మొత్తంలో వ్యాట్ పెంచడం మీద వివరణ ఇస్తూ రాష్ట్ర రెవెన్యూ పడిపోవడం వలనే పెంచుతున్నామని వివరణ ఇచ్చుకుంది.  గతేడాది ఏప్రిల్ నెలకు ఆదాయం రూ.4,480 కోట్లు ఉండగా ఈ యేడాది అది రూ.1,323 కోట్లకు పడిపోయింది.  దీనికి తోడు సంక్షేమ పథకాల పేరుతో వేల కోట్లను ప్రజల ఖాతాల్లోకి జమ చేయడంతో సర్కార్ మీద భారం మరింత పెరిగింది.  వాటిని తట్టుకోవడానికే ఈ పెంపు అంటున్నారు.  ఇది విన్న జనం పథకాల పేరుతో కొందరికి లబ్ది చేకూర్చి వారిని కవర్ చేయడానికి ఇలా అందరి నెత్తిన భారం వేస్తారా అంటూ వాపోతున్నారు.  వారి బాధలో కూడా అర్థం ఉంది.  లాక్ డౌన్ కారణంగా ప్రభుత్వానికీ ఆదాయం ఎలా తగ్గిందో జనాలకు సైతం పనులు లేక ఆదాయానికి గండి పడింది.  ఈ విషయాన్ని కూడా ప్రభుత్వం ఆలోచించాలి మరి.