మోడీ పాల‌న‌పై ఏపీ బీజేపీ ప్రజాభిప్రాయ సేక‌ర‌ణ‌!

కేంద్రంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప‌రిపాల‌న‌పై బీజేపీ రాష్ట్ర‌శాఖ ప్ర‌జాభిప్రాయ సేక‌ర‌ణ‌ను చేప‌ట్టింది. దీనికోసం సోష‌ల్ మీడియాను వినియోగించుకుంటోంది. మోడీ ప‌రిపాల‌న‌, నియోజ‌క‌వ‌ర్గాల్లో మౌలిక పరిస్థితులు, ఎన్నిక‌ల్లో పోటీ చేయాల‌ని భావిస్తోన్న అభ్య‌ర్థులపై ఆరా తీస్తోంది. ఆయా అంశాల‌పై న‌మో యాప్ ద్వారా ప్ర‌జ‌ల అభిప్రాయాల‌ను సేకరిస్తోంది.

కొన్ని ప్ర‌శ్న‌ల‌ను రూపొందించి, వాటిని యాప్‌లో అందుబాటులో ఉంచింది. భార‌త ప్ర‌భుత్వ ప‌నితీరు మెరుగుప‌డింద‌ని మీరు అన‌కుంటున్నారా?, భార‌త‌దేశ భ‌విష్య‌త్తు గురించి ముందుకంటే ఇప్పుడు సానుకూలంగా ఉంద‌ని భావిస్తున్నారా? వ‌ంటి ప్ర‌శ్న‌లు ఇందులో ఉన్నాయి.

అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల వారీగా రోడ్లు, విద్యుత్‌, మంచినీరు, విద్య‌, వైద్యం వంటి మౌలిక స‌దుపాయాల‌తో పాటు శాంతిభ‌ద్ర‌త‌లు, చౌక ధ‌ర‌ల దుకాణాల ప‌నితీరు, ప‌రిశుభ్ర‌త‌పై అభిప్రాయాల‌ను స్వీక‌రిస్తోంది. దీనికి సంబంధించి త‌మ అభిప్రాయాల‌ను న‌మో యాప్ ద్వారా నేరుగా ప్ర‌ధాన‌మంత్రికే తెలియ‌జేయ‌వ‌చ్చ‌ని సూచించింది. 18002090920 నంబ‌ర్‌కు మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా కూడా త‌మ ఫీడ్‌బ్యాక్‌ను అంద‌జేయ‌వ‌చ్చ‌ని రాష్ట్ర బీజేపీ పేర్కొంది.