తెలంగాణ కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి డికె అరుణకు చుక్కెదురైంది. చట్ట విరుద్దంగా తెలంగాణ అసెంబ్లీ రద్దు చేశారని దీనిని వెంటనే నిలిపేయాలని కోరుతూ డికె అరుణ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై విచారించిన కోర్టు పిటిషన్ చెల్లదని కొట్టివేస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. డికె అరుణ సుప్రీం కోర్టుకు వెళ్లడానికంటే ముందు ఇదే పిటిషన్ హైకోర్టులో దాఖలు చేశారు. దానిని హైకోర్టులో డికె అరుణకు హైకోర్టు, సుప్రీం కోర్టులో చుక్కెదురైంది.
ప్రజలు ఓట్లు వేసి గెలిపిస్తే ఇష్టానుసారంగా సభను రద్దు చేశారని అరుణ పిటిషన్ లో పేర్కొన్నారు. సభలో ఉన్న శాసన సభ్యుల హక్కులను కాలరాస్తూ ప్రతిపక్షాల సభ్యులకు కనీస సమాచారం ఇవ్వకుండా అసెంబ్లీని రద్దు చేశారన్నారు. ఇది చట్ట విరుద్దమని ఒక ముఖ్యమంత్రి తన స్వార్దం కోసం ఇలా ప్రవర్తించడం తగదన్నారు. రెండు కోర్టులు ఈ వాదనలతో ఏకీభవించకుండా కేసును కొట్టేశాయి. సభ రద్దు నిర్ణయం విషయంలో జోక్యం చేసుకునేందుకు కోర్టులు నిరాకరించాయి.
ఇదిలా ఉంటే కాంగ్రెస్ నేత డికె అరుణను సీమాంధ్ర లాయర్లు తప్పుదోవ పట్టించారని ఆమె అనుచరులు చర్చించుకుంటున్నారు. ఈ పిటిషన్ కోర్టులో నెగ్గదని తెలిసినా కూడా డికె అరుణతో సుప్రీం కోర్టులో పిటిషన్ వేయించారని గుసగుసలు నడుస్తున్నాయి. అసెంబ్లీ ఏ కారణం చేత రద్దైనా సరే ఆరు నెలలలోపు ఎన్నికల సంఘం ఎన్నికలు నిర్వహిస్తది దానిని ఎవరూ ఆపలేరన్నారు.
శాసనసభ రద్దుకు మెజార్టీ సభ్యుల మద్దతు ఉంటే చాలనీ ప్రతి ఒక్క సభ్యునికి చెప్పాల్సిన అవసరం లేదనే విషయం చాలా స్పష్టమైనప్పటికి కూడా పిటిషన్ వేయించడం పై వారు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కావాలనే పిటిషన్ వేయించారని డికె అరుణ ప్రతిష్టను దిగజార్చారని వారు ఆరోపించారు.
ఎన్నికల వేళ డికె అరుణకు ఎదురుదెబ్బగా చెప్పవచ్చని పలువురు చర్చించుకుంటున్నారు. డికె అరుణకు అన్ని విషయాలు తెలిసినా కూడా అలా ఎలా తప్పు నిర్ణయం తీసుకున్నారని అనుకుంటున్నారు. అన్ని నిబంధనలు తెలిసినాక కూడా అలా ఎలా చేస్తారని అనుకుంటున్నారు. డికె అరుణను కావాలనే తప్పు దోవ పట్టించారేమో ఇప్పటికైనా డికె అరుణ ఆలోచించాలని వారు చర్చించుకుంటున్నారు. హైకోర్టులో పిటిషన్ కొట్టి వేసినప్పుడు సుప్రీం కోర్టుకు వెళ్లే ముందు డికె అరుణ న్యాయ నిపుణులతో చర్చిస్తే బాగుండేదని పార్టీకి కూడా కాస్త నష్టం జరిగినట్టేనని పార్టీ నేతలు చర్చించుకుంటున్నారు. ఇప్పటికైనా డికె అరుణ నిజం తెలుసుకొని పరిస్థితి చక్కదిద్దుకుంటే బాగుంటుందని కేడర్ లో చర్చ జరుగుతోంది.