Posani Krishna Murali: సినీ నటుడు, మాజీ వైసీపీ నేత పోసాని కృష్ణ మురళి కేసు మరింత సీరియస్ మలుపు తిరుగుతోంది. ఇటీవల అన్నమయ్య జిల్లా పోలీసులు హైదరాబాద్ వెళ్లి అరెస్టు చేసిన ఆయనను, విచారణ అనంతరం రాజంపేట సబ్ జైలుకు తరలించారు. అయితే ఈ ఉదయం అతడిని పల్నాడు జిల్లా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నరసరావుపేటలో నమోదైన కేసుకు సంబంధించి ఆయనను పీటీ వారెంట్ ద్వారా తరలిస్తున్నారు. ఇది పోసాని లీగల్ సమస్యలు మరింత పెరిగే సూచనలని విశ్లేషకులు చెబుతున్నారు.
ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌లపై వైసీపీ హయాంలో పోసాని చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలు రాజకీయంగా తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. దీనిపై రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో కేసులు నమోదు కాగా, ప్రస్తుతం వాటిలో విచారణ వేగంగా జరుగుతోంది. మొదట ఓబులవారిపల్లె కేసులో అరెస్టైన ఆయన, ఇప్పుడు నరసరావుపేట కేసులోనూ ఇరుక్కోవడంతో ఆయనకు తలనొప్పి పెరిగింది. ఇక విచారణ అనంతరం ఏమి జరుగుతుందన్నది ఆసక్తిగా మారింది.
అదనపు చిక్కుల నుంచి తప్పించుకోవాలని భావించారా ఏమో కానీ, పోసాని అనారోగ్య నాటకం ఆడినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అరెస్టు తర్వాత అనారోగ్య సమస్యల పేరుతో రాజంపేట ఆసుపత్రికి, ఆపై కడప రిమ్స్‌కు తరలించినప్పటికీ వైద్య పరీక్షల్లో ఎటువంటి సమస్య లేదని తేలింది. పోలీసులను ఇబ్బంది పెట్టేందుకు కావాలని అలా ప్రవర్తించారన్న విమర్శలు కూడా వినిపిస్తున్నాయి.
ఇప్పుడు నరసరావుపేట తరలింపు నేపథ్యంలో పోసాని పరిస్థితి ఏ మలుపు తీసుకుంటుందన్నది ఉత్కంఠ రేపుతోంది. రాజకీయ వ్యాఖ్యలే ఆయనను ఈ స్థాయికి తెచ్చేశాయా? లేక మరిన్ని చట్టపరమైన సమస్యలు ఎదుర్కొవాల్సి వస్తుందా? అన్నది తేలాల్సి ఉంది. ఏదేమైనా, రాజకీయంగా, లీగల్‌గా పోసాని వ్యవహారం మరింత ఉత్కంఠకు దారి తీస్తుందనేది స్పష్టంగా కనిపిస్తోంది.