పవన్ కళ్యాణ్‌పై ఆంధ్రా ఆక్టోపస్ స్పెషల్ ఫోకస్

Pawan Kalyan
Pawan Kalyan
Pawan Kalyan

ఆంధ్రా ఆక్టోపస్, వీర సమైక్యవాది లగడపాటి రాజగోపాల్ చాలాకాలం తర్వాత మళ్ళీ మీడియా కెమెరాలకు చిక్కారు. ఆంద్రపదేశ్‌లో మునిసిపల్ ఎన్నికల నేపథ్యంలో ఓటు హక్కుని వినియోగించుకున్న లగడపాటి రాజగోపాల్, మీడియాకి కన్పించగానే ఆయన ముందు చాలా ప్రశ్నలు వచ్చిపడ్డాయి.

ఆయా ప్రశ్నలకు సమాధానం చెబుతూ, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తనకు అత్యంత సన్నిహితుడని చెప్పుకున్నారు. దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డితోనూ తనకు సన్నిహిత సంబంధాలు వుండేవనీ, వైఎస్సార్ హయాంలో సంక్షేమం, అభివృద్ధి సమాంతరంగా వుండేవనీ, ఏ ప్రభుత్వమైనా అదే పద్ధతి పాటించాలనీ లగడపాటి రాజగోపాల్ చెబుతూ, పరోక్షంగా రాష్ట్రంలో జగన్ పాలనపై సెటైర్లు వేశారు. ‘జగన్ పాలన ఎలా వుందన్నది మూడేళ్ళ తర్వాతే స్పష్టత వస్తుంది’ అని లగడపాటి వ్యాఖ్యానించడం గమనార్హం. ‘పవన్ కళ్యాణ్ ఓడిపోయినా రాజకీయాల్లోనే కొనసాగుతున్నారు.. ఈ విషయంలో ఆయన్ని అభినందించాలి’ అని లగడపాటి చేసిన వ్యాఖ్యలతో ఒక్కసారిగా రాజకీయ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చకు ఆస్కారం కలిగింది. టీడీపీతో 2019కి ముందు అంట కాగిన లగడపాటి రాజగోపాల్, ఆ తర్వాత పెద్దగా మీడియా ముందు కనిపించలేదు. తన జోస్యాలన్నీ బొక్క బోర్లాపడటంతోనే లగడపాటి తెరమరుగైపోయారు. ‘ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రెండుగా విడిపోతే, ప్రత్యక్ష రాజకీయాల్లో వుండను’ అని ఈ మాజీ ఎంపీ స్పష్టం చేశారు గతంలోనే.

దానికి ఆయన కట్టుబడి వున్నారట.. ఈ విషయాన్ని ఇంకోసారి కుండబద్దలుగొట్టేశారు. అయితే, జనసేన పార్టీతో ఆయన టచ్‌లోకి వెళ్ళేందుకు ప్రయత్నిస్తున్నారనీ, టీడీపీ కోవర్టుగానే ఆయన ఇంకా వ్యవహరిస్తున్నారనీ గుర్తించిన జనసేన, ఆయన్ని దగ్గరకు రానిచ్చేందుకు సుముఖత వ్యక్తం చేయడంలేదట. 2024 నాటికి ఆయన ఖచ్చితంగా రాజకీయ తెరపై కన్పిస్తారనీ, టీడీపీనా.? బీజేపీనా.? అన్నదానిపై త్వరలోనే స్పష్టత వస్తుందని రాజకీయ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తుండడం గమనించదగ్గ విషయం.