పవన్ సన్నాయి నొక్కులు.. ఇచ్చిపడేసిన యాంకర్ రష్మి!

విపక్షంలో ఉన్నంత కాలం మైకుల ముందుకు వచ్చిన ప్రతీసారీ పవన్ కల్యాణ్ చెప్పే మాటల్లో.. మహిళల భద్రత, జవాబుదారీతనం ప్రధానంగా వినిపించేవి! ఈ అంశాలపై ఆయన అనర్గలంగా, ఆవేశంగా ప్రసంగాలు చేసేవారు! దీంతో… పవన్ కల్యాణ్ ఆవేశంలో నిజాయితీ ఉందని నమ్మిన ప్రజలు.. ఇటీవల జరిగిన ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిపించారు.. ఫలితంగా డిప్యూటీ సీఎంగా ఆయన బాధ్యతలు అందుకున్నారు.

అయితే… అప్పుడున్న ఫైర్ ఇప్పుడు పవన్ లో పూర్తిగా పోయినట్లు కనిపిస్తుందనే మాటలు వినిపిస్తున్నాయి! డిప్యూటీ సీఎంగా మారిన తర్వాత ఆయన గతంలో చెప్పిన జవాబుదారీ తనం నుంచి చాలా దూరం జరిగారనే కామెంట్లు కనిపిస్తున్నాయి! అప్పుడు ఉన్న ఫైరూ లేదు, రియాక్షనూ లేదని అంటున్నారు. సరిగ్గా యాక్షన్ చేసే అవకాశం వచ్చాక.. రియాక్షన్ లేకపోవడం ఏమిటంటూ సెటైర్లు వేస్తున్నారు. ఇది ఆనాటి పవన్ కల్యాణేనా కాదా అనే సందేహాలు తెరపైకి వస్తున్నాయి.

అవును… విపక్షంలో ఉన్నప్పుడు మహిళల రక్షణ గురించి భారీ భారీ ఉపన్యాసాలు ఆవేశంగా చెప్పిన పవన్… అధికారంలోకి వచ్చిన తర్వాత 8 ఏళ్ల బాలికపై హత్యాచారం జరిగితే… “పేపర్ లో చూసి తెలుసుకున్నాను”.. అన్నట్లు సన్నాయి నొక్కులు నొక్కడమేమిటని నిలదీస్తున్నారు.. పవన్ లో అప్పటి ఆవేశం ఏదని ప్రశ్నిస్తున్నారు.. పవన్ కూడా… అధికారంలో ఉంటే ఒకలా, విపక్షంలో మరోలా స్పందించే రొటీన్ రాజకీయ నాయకుడేనా అని సందేహపడుతున్నారు!

వివరాళ్లోకి వెళ్తే… నంద్యాల జిల్లా మచ్చుమర్రిలో ఎనిమిదేళ్ల బాలికపై ముగ్గురు మైనర్లు హత్యాచారం చేసిన ఘటన తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించింది. ఈ సమయంలో తాజాగా జాతీయ మీడియా.. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ను ప్రశ్నించింది. దీనికి సమాధానంగా స్పందించిన పవన్… దాని గురించి చదవడం తనకు తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించిందని అన్నారు.

ఇదే సమయంలో… నేరస్థులు కూడా మైనర్లే అని.. ఇది శారీరక విద్య గురించి కాదు, యువకుల మనస్సులు భ్రష్టుపట్టిపోతున్నాయని చెప్పుకొచ్చారు. ఇదే సమయంలో యువకులు మనస్సులు అనేక కారణాల వల్ల చెడిపోతున్నాయని.. పాఠశాల స్థాయిలోనే కఠినంగా శిక్షించబడుతుందని భావిస్తున్నట్లు స్పందించారు. దీంతో… ఈ రియాక్షన్ పై నెటిజన్లు గట్టిగా రియాక్ట్ అవుతున్నారు.

దీంతో… గత ఆదివారం 8 ఏళ్ల పాపను దారుణంగా హత్యాచారం చేసి చంపితే.. ఇంతవరకు ఆ మృతదేహాన్ని కూడా కనిపెట్టలేకపోయారు. రాష్ట్రానికి డిప్యూటీ సీఎంగా ఉంటూ జరిగిన ఘటనకు బాధ్యత తీసుకోవాల్సింది పోయి.. నేను పేపర్ లో చదివాను అని చెప్పడం ఏంటి పవన్.. రాష్ట్రంలో లా & ఆర్డర్ గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదా నీకు? అని ప్రశ్నించింది వైసీపీ.

ఇదే సమయంలో… రాష్ట్రంలోని మహిళా లోకం ఈ వ్యవహారంపై తీవ్రంగా స్పందిస్తోంది. ఇంత మేజర్ తప్పు చేశాక వాళ్లు కూడా మైనర్లు అంటూ సన్నాయి నొక్కులు నొక్కడం ఏమిటి.. జుట్టు ఎగరేస్తూ, గొంతు చించుకుంటూ నాడు మైకుల ముందు మహిళల భద్రత గురించి మాట్లాడిన పవన్ నోరు ఇప్పుడు ఎందుకు పెగలడం లేదని నిలదీస్తుంది. అయితే ఇలా నిలదీస్తున్న వారిలో వీర మహిళలు ఉన్నారా లేదా అనేది తెలియాల్సి ఉంది!

రష్మీ రియాక్షన్ వైరల్!:

ఇలా ఎనిమిదేళ్ల బాలికపై ముగ్గురు మైనర్లు హత్యాచారం చేసిన ఘటనపై ప్రభుత్వ పెద్దలు సన్నాయి నొక్కులు నొక్కుతున్న వేళ యాంకర్ రష్మీ ఘాటుగా స్పందించింది. ఈ సందర్భంగా ఏపీ ప్రభుత్వ పెద్దలకు విజ్ఞప్తి చేసింది. ఇందులో భాగంగా… వాళ్లు పెద్దవాళ్లలాగా రేప్ చేయగలిగితే… వాళ్లని పెద్దవాళ్ల లాగానే శిక్షించాలని సూచించింది. వాళ్లు చేసిన తప్పుకు ఏమాత్రం పశ్చాత్తాప పడటం లేదని తెలిపింది.

వాళ్లు కచ్చితంగా మైనర్లు అయితే కాదు! మైనర్లు అనే కార్డుతో వాళ్లు తక్కువ శిక్షతో బయటపడటం కోసం ప్రయత్నిస్తున్నట్లున్నారు! ఇది ఏమాత్రం కరెక్ట్ కాదు.. అంటూ ‘ఎక్స్’ వేదికగా స్పందించింది!

దీంతో రష్మీ రియాక్షన్ పై నెటిజన్లు ప్రశంసల జల్లులు కురిపిస్తున్నారు. “పవర్” స్టార్ అయిన డిప్యూటీ సీఎం పవన్ కు ఈమె ఒక్క ట్వీట్ తో ఇచ్చిపడేసినట్లే అని కామెంట్ చేస్తున్నారు. రష్మీలో ఉన్న ఫైర్ కూడా.. చేతిలో అధికారంలో ఉన్న పవన్ కల్యాణ్ లేకపోవడం శోచనీయమని స్పందిస్తున్నారు. ఏది ఏమైనా… పవన్ లెవెల్ రియాక్షన్ మాత్రం ఇది కాదని జనసైనికులు సైతం పెదవి విరుస్తున్నారని తెలుస్తోంది!