“నిన్ను మీ అమ్మ తనకోసం కనలేదురా.. జనంకోసం కంది. నీ పేరు శివాజీ కాదురా.. నీ చుట్టూఉన్నవాళ్ల కోసం పుట్టుకొచ్చిన చత్రపతివి. తిప్పరా మీసం” అనే డైలాగ్ చత్రపతి సినిమాలో హైలెట్! సరిగ్గా ఇలాంటి డైలాగే పవన్ కోసం చంద్రబాబు చెబితే ఎలా ఉంటుంది?…. “మీ అమ్మ నిన్ను తనకోసం కనలేదు – కాపుజాతి ఉద్దరణకోసం కనలేదు.. చంద్రబాబు కోసం కన్నది. నీపేరు పవర్ స్టార్ కాదు.. టీడీపీ కోసం జనసేనగా పుట్టుకొచ్చిన ప్యాకేజీ స్టార్ వి. వంచించరా జనసైనికులని!” అంటూ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నారు వైసీపీ శ్రేణులు. దీనికి కారణం… తాజాగా పవన్ వ్యవహారశైలిపై అంబటి చేసిన వ్యాఖ్యలే కారణం!
పవన్ పేరు చెబితే అంతెత్తున లేచే వైకాపా నేటల్లో అంబటి రాంబాబు ఒకరు. శ్రీరమనవమి సందర్భంగా ఒంటిమిట్ట రామాలయంలో పట్టువస్త్రాలు సమర్పించిన అనంతరం చంద్రబాబు – పవన్ లపై అంబటి నిప్పులు చెరిగారు. పవన్ కల్యాణ్, చంద్రబాబు కోసమే పుట్టాడని మెల్లగా మొదలెట్టిన అంబటి… బాబు కోసమే పుట్టి, బాబు కోసమే పనిచేస్తున్నాడని, ఇకముందు కూడా బాబు కోసమే పని చేస్తాడు… అలాంటి వ్యక్తిని దేవుడే రక్షించాలి అని సెటైర్ వేశారు అంబటి రాంబాబు.
ఇదే క్రమంలో… టీడీపీ ఆవిర్భావ దినోత్సంవం సందర్భంగా చంద్రబాబు.. ఏపీ పునర్నిర్మాణ బాధ్యతలు తీసుకుంటానని చెప్పిన వ్యాఖ్యలపై కూడా అంబటి ఘాటుగా స్పందించారు. చంద్రబాబు ఒక మ్యానుపులేటర్ అని, వ్యవస్థల్ని మేనేజ్ చేసి అధికారంలోకి రావడానికి ప్రయత్నం చేస్తున్నాడని మండిపడిన అంబటి… చంద్రబాబు రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేస్తానని చెప్పడం హాస్యాస్పదం అని అన్నారు. ఇక, మరో అవకాశం ఇస్తే పోలవరాన్ని నాశనం చేసినట్లే రాష్ట్రాన్ని కూడా సర్వనాశనం చేస్తారంటూ ఫైర్ అయ్యారు. ఇదే సందర్భంలో… చంద్రబాబు మళ్లీ అధికారంలోకి వస్తే ఆయన ఆస్తులను, కొడుకును పునర్నిర్మిస్తాడు తప్ప ప్రజలకు ఏమీ ఒరగదని క్లారిటీ ఇచ్చారు.
ఇక ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలపై స్పందించిన అంబటి… ఈ ఎన్నికల్లో కూడా ఓటుకు కోట్లు చేతులు మారాయని ఆరోపించారు! తెలంగాణలో లాగా దాన్ని తాము నిరూపించలేకపోవచ్చు కానీ, టీడీపీ ఆ నలుగురు ఎమ్మెల్యేలను కొనుగోలు చేసిందని… ఓటుకు నోటు కేసును గుర్తుకుతెచ్చే ప్రయత్నం చేశారు!