పవన్ ఆర్థిక మూలాలపై అంబటి గురి… ఢిల్లీలో అపాయింట్మెంట్స్ ఫిక్స్!

ఏదో అనుకుంటే ఇంకేదో అయ్యిందే అన్నట్లుగా అయిపోయింది పవన్ కల్యాణ్ పరిస్థితి అని అంటున్నారు విశ్లేషకులు. కారణం… బ్రో సినిమాలో శ్యాంబాబు పాత్రను పెట్టి, ఏపీ మంత్రి అంబటి రాంబాబుపై సెటైర్ వేశారని సోషల్ మీడియా కోడై కూస్తోంది. ఈ విషయాన్ని అంబటి అంత తేలిగ్గా వదిలేలా లేరని తెలుస్తోంది. ఈ విషయమై ఆయన హస్తినకు వెళ్లాలని ఫిక్సయినట్లు సమాచారం.

అవును… జనసేన అధినేత పవన్ కల్యాణ్, సాయి ధరమ్ తేజ్ నటించిన తాజా చిత్రం.. బ్రో సినిమా ఏపీలో పెద్ద ఎత్తున రాజకీయ దుమారానికి కేంద్రబిందువు అయిందని అంటున్నారు. ఈ సినిమాలో శ్యాంబాబు పాత్ర, తీరుతెన్నులపై ఏపీ మంత్రి అంబటి రాంబాబు ఇప్పటికే పవన్ ను కడిగి పడేశారు. తనను రాజకీయంగా ఎదుర్కోలేక ఇలా శునకానందం పొందుతున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

అనంతరం… విలేకరుల సమావేశాన్ని పెట్టి మరీ పవన్ కల్యాణ్‌ పై ఘాటు విమర్శలు చేశారు. దీనికి తగిన మూల్యాన్ని పవన్ కల్యాణ్ చెల్లించుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. పవన్ కల్యాణ్‌ ను హీరోగా పెట్టి తాను కూడా సినిమా తీస్తానని పేర్కొన్న ఆయన.. స్క్రిప్ట్‌ ను కూడా వివరించారు. కొన్ని టైటిళ్లనూ సూచించారు. టైటిల్స్ విషయంలో కానీ, కథ విషయంలోనూ కానీ పాత్రికేయ మిత్రులు ఏవైనా సలహాలూ సూచనలు ఇస్తే స్వీకరిస్తానని తెలిపారు.

ఈ సమయంలో “తాళి-ఎగతాళి”, “పెళ్లి – పెటాకులు”, “బహు భార్యల ప్రావీణ్యుడు”, మొదలైన టైటిళ్లు పరిశీలనలో ఉన్నట్లు అంబటి రాంబాబు వివరించారు. బ్రో సినిమాకు మాటలు, స్క్రీన్‌ప్లే రచయితగా పని చేసిన ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌, నిర్మాత టీజీ విశ్వప్రసాద్‌ నూ మంత్రి హెచ్చరించారు.

అయితే ఈ వ్యవహారం అక్కడితో ఆగలేదు. బ్రో సినిమా బడ్జెట్, పవన్ కల్యాణ్‌ కు ఇచ్చిన రెమ్యునరేషన్, విడుదల తరువాత వచ్చిన కలెక్షన్లు.. వంటి అంశాలన్నింటిపైనా కేంద్ర దర్యాప్తు సంస్థలకు ఫిర్యాదు చేయనున్నారని తెలుస్తోంది. ఇందులో భాగంగా… సీబీఐ, ఈడీ, ఆదాయపు పన్ను శాఖ అధికారులను కలిసి ఫిర్యాదు చేస్తారని తెలుస్తోంది.

ఇందుకోసం మంత్రి అంబటి రాంబాబు.. బుదవారం సాయంత్రం దేశ రాజధానికి బయలుదేరి వెళ్లనున్నారని సమాచారం. ఇప్పటికే దీనికి సంబంధించిన ఏర్పాట్లు పూర్తయ్యాయని, ఆయా దర్యాప్తు సంస్థల ఉన్నతాధికారులతో అపాయింట్మెంట్ ఫిక్స్ అయినట్లు చెబుతున్నారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల సందర్భంగా ఢిల్లీలోనే ఉన్న వైసీపీ ఎంపీలతో కలిసి అంబటి రాంబాబు దర్యాప్తు సంస్థల అధికారులను కలుస్తారని తెలుస్తోంది.

దీంతో బ్రో సినిమా విషయాన్ని అంబటి రాంబాబు అంత తేలిగ్గా తీసుకోలేదని తెలుస్తోంది. సినిమా ఆర్ధిక విషయాలపై ఏకంగా సీబీఐ, ఈడీ, ఐటీ అధికారులను కలవాలని అంబటి ఫిక్సవ్వడం చూస్తుంటే… పవన్ ఆర్ధిక మూలాలపై టార్గెట్ చేసినట్లుందని అంటున్నారు. ఏది ఏమైనా… అంబటి ఢిల్లీ యాత్ర ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ అయ్యిందని అంటున్నారు పరిశీలకులు.