ఒకప్పుడు అసెంబ్లీలో గంభీరమైన గొంతెత్తి ప్రత్యర్థులను నిలదీసిన వైసీపీ నేత అనిల్ కుమార్ యాదవ్, ఇప్పుడు నిరసనలకు కూడా వెనుకడుగు వేస్తున్నారంటే ఆశ్చర్యంగా ఉంది. నెల్లూరు నగరంలో మంత్రి పదవి దక్కిన సందర్భం నుంచి గట్టిగానే హోదా దక్కించుకున్న అనిల్, 2024 ఎన్నికల్లో పరాజయం అనంతరం దాదాపు ప్రజల దృష్టికి దూరమయ్యారు. అప్పటివరకు పబ్లిక్‌లో కనిపిస్తూ, మీడియా ముందు పదేపదే ఎదురుదాడులకు దిగిన అనిల్ ఇప్పుడు మాత్రం మౌనంలోకి వెళ్లిపోయారు.
ఇటీవల సైదాపురం మైనింగ్ ఇష్యూ తో, మరోసారి యాక్షన్ మోడ్‌లోకి వస్తారని అనుకున్నారు. ఇటీవల శ్రీనివాస పద్మావతి మైనింగ్ కంపెనీపై పలు ఆరోపణలు వచ్చాయి. దీంతో అనిల్ స్వయంగా వెళ్లి అక్కడ ర్యాలీ నిర్వహిస్తానని ప్రకటించగా, అనేక ఆశలు కలిగాయి. కానీ ఏకంగా తేదీ వచ్చేసినా, అనిల్ కనిపించలేదు. స్థానికులు, పార్టీ శ్రేణులు ఎదురుచూస్తున్న వేళ, ఆయన ప్రెస్‌నోట్ ఇచ్చేసి వెనక్కి తగ్గారు. ఈ వ్యవహారంపై పార్టీ శ్రేణులలో అసంతృప్తి వ్యక్తమవుతోంది.
అయితే పోలీసుల మోహరింపు చూసి ఆయన ముందుకు రాలేకపోయారన్న వాదన కూడా వినిపిస్తోంది. అనిల్ రాగానే అరెస్టు చేసి దారికి రాకుండా చేస్తారన్న భయం వల్లే ఆయన ఆ నిర్ణయం తీసుకున్నారట. మరోవైపు ఇది ప్లాన్ ప్రకారమే చేయాలని వైసీపీ నుంచి ఆదేశాలు వచ్చేయనే టాక్ కూడా ఉంది. చిన్న విషయానికి 100 మంది పోలీసులను మోహరించడం వెనుక ఏదో రాజకీయ వ్యూహం ఉందని అంటున్నారు. ఏదేమైనా అనిల్ రాకపోవడం ఫలితంగా పబ్లిక్‌లో నమ్మకాన్ని కోల్పోయినట్టే అయిందని విశ్లేషకుల అభిప్రాయం.
నాయకుడిగా ముందుండి పోరాడే కంటే భయంతో తప్పుకునే నేతగా ఆయనకు బలమైన ముద్ర పడే ప్రమాదం కనిపిస్తోంది. ఇక అంతటితో ఆగకుండా, ఈ వ్యవహారం వైసీపీ అంతర్గతంగా ఆసక్తికర చర్చలకు దారి తీసింది. ఒకప్పుడు పార్టీకి దూకుడైన ప్రచారం ఇచ్చిన నేత, ఇప్పుడు మౌనంగా వెనుకపడిపోవడం నిన్న మొన్నటి నమ్మకస్థులకే అర్థం కావడం లేదు. అనిల్ రీ ఎంట్రీ ఎప్పుడో? ఎలా ఉంటుంది? అన్నదే ఇప్పుడు నెల్లూరులో హాట్ టాపిక్.