ఫోన్ లు లాక్కుని ..మీడియాకు శివాజీ బెదిరింపులు

ఈ మధ్యకాలంలో ‘ఆపరేషన్‌ గరుడ’తో వార్తల్లో నిలిచిన సినీనటుడు శివాజీ , ఈ సారి మీడియాకు వార్నింగ్ ఇవ్వటం చర్చనీయాంశమైంది. కృష్ణా జిల్లా గన్నవరం సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయంకు వచ్చిన ఆయన్ని కవర్ చేయటానికి ప్రయత్నించిన మీడియాతో రూడ్ గా బిహేవ్ చేసారు.

గన్నవరం మండల పరిధిలోని అపార్టుమెంట్‌లో ప్లాట్ల కొనుగోలు నిమిత్తం వచ్చిన ఆయన మీడియా కంటపడకుండా ఉండేందుకు ప్రయత్నించారు. అయితే అక్కడికి వచ్చిన మీడియా ప్రతినిధులపై శివాజీ విరుచుకుపడ్డారు. ఫొటోలు, వీడియోలు తీస్తే మీ సంగతి చూస్తానంటూ బెదిరింపులకు దిగారు.

అంతేకాకుండా ‘రాస్తే రాసుకోండి.. మహా అయితే చంద్రబాబు ఇచ్చిన డబ్బులతో శివాజీ ఆస్తులు కొంటున్నాడని రాస్తారు… అంతేగా..’ అంటూ చిరుబుర్రులాడారంటూ సాక్షి దినపత్రిక రాసుకొచ్చింది. ఇక రిజిస్ట్రేషన్‌ పూర్తికాగానే పరుగు పరుగున కారు ఎక్కేసి వెళ్లిపోయారని ఆ పత్రిక రాసింది.

గన్నవరం మండలం చిన్నఆవుటపల్లి పరిధిలో ఓ రియల్‌ ఎస్టేట్‌ సంస్థకు చెందిన అపార్టుమెంట్‌లో రెండు ప్లాట్లు రిజిస్ట్రేషన్‌ చేసారు శివాజీ . శివాజీ నేరుగా సబ్‌రిజిస్ట్రార్‌ చాంబర్‌లోకి వెళ్లి కూర్చోగా ఆయన వెంట వచ్చిన వ్యక్తులు రిజిస్ట్రేషన్‌ కార్యక్రమాన్ని పూర్తి చేశారు.

అక్కడకు చేరుకున్న మీడియా ప్రతినిధులను ఫొటోలు తీయకుండా శివాజీ వ్యక్తిగత సిబ్బంది, అనుచరులు అడ్డుకోవటమే వివాదానికి కారణమైంది. దౌర్జన్యంగా ఫోన్‌ల నుంచి ఫొటోలను తొలగించటం మీడియాలో చర్చనీయాశంగా మారింది.