కూటమి ప్రభుత్వం ఏపీలోని మహిళలకు మరో శుభవార్త అందించింది. భారీగా అంగన్‌వాడీ సహాయకుల పోస్టులను భర్తీ చేసేందుకు అనుమతి ఇచ్చింది. ఇటీవల 4,687 మినీ అంగన్‌వాడీలను మెయిన్ అంగన్‌వాడీలుగా ప్రభుత్వం అప్‌గ్రేడ్ చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఆయా అంగన్‌వాడీ కేంద్రాల్లో 4,687 సహాయకుల పోస్టుల భర్తీ చేపట్టనుంది. ఈమేరకు మహిళా శిశు సంక్షేమ శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. త్వరితగతిన పోస్టుల భర్తీని చేపట్టాలని స్థానిక అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. అంగన్‌వాడీ కేంద్రాల్లో మెరుగైన సేవలు అందించడంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది.
మినీ అంగన్‌వాడీ కార్యకర్తలకు ఇటీవల ప్రభుత్వం పదోన్నతి కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీని ప్రకారం పదో తరగతి పాసైన 4,687 మంది మినీ అంగన్‌వాడీ కార్యకర్తలను మెయిన్ అంగన్‌వాడీ కార్యకర్తలుగా నియమిస్తారు. ఇలా నియమితులైన కార్యకర్తలకు నెలకు రూ.11,500 గౌరవ వేతనం కింద అందిస్తారు. ఈ క్రమంలోనే ప్రస్తుతం 4,678 అంగన్ వాడీ సహాయకుల పోస్టుల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
ఈ పోస్టులకు అర్హులు ఎవరంటే..?
** ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి.
** స్థానిక వ్యక్తులు కావడంతో పాటు వివాహితులు అయ్యి ఉండాలి.
** అభ్యర్థుల వయస్సు 01.07.2025 నాటికి 21 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల లోపు ఉండాలి.
** ఎస్సీ, ఎస్టీ ప్రాంతాల్లో ఉండే ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 18 సంవత్సరాలు నిండాలి.
** ఎస్సీ, ఎస్టీ హాబిటేషన్స్ నందు ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు మాత్రమే అర్హులు
** దరఖాస్తుతో పాటు కులం ధృవీకరణ పత్రం, నివాసం పత్రం, పుట్టిన తేదీ, 10వ తరగతి మార్కుల మెమో, ఆధార్ కార్డు, వికలాంగుల అయితే అందుకు సంబంధించిన పత్రములపై గెజిటెడ్ అధికారి చేత సంతకం చేసి జతపర్చాలి.
** దరఖాస్తులో ఇటీవల ఫొటోలను ముందు భాగంలో అతికించి, ఫొటోపై కూడా గెజిటెడ్ అధికారితో ధృవీకరణ తీసుకోవాలి.
** దరఖాస్తులను స్థానిక అధికారులకు స్వయంగా లేదా పోస్టు ద్వారా అందించొచ్చు. మరిన్ని వివరాల కోసం అధికారులను సంప్రదించండి.

