ఆంధ్రప్రదేశ్‌లో అవసరానికి తగ్గట్లు బీజేపీ తన స్టాండ్ మార్చుకుంటుందా..? అసలు రాష్ట్రంలో బీజేపీ స్టాండ్ ఏంటి..? అధికార వైకాపాకు బీజేపీ మద్దతు ఇస్తోందా.. లేక చిక్కులు పెట్టడానికి చూస్తుందా..? స్థానిక ఎన్నికల వాయిదాతో ఇప్పుడు రేకెత్తుతున్న అనుమానాలు ఇవి. ఇటీవలి కాలంలో కేంద్రం కొన్ని విషయాల్లో వైకాపాకు మద్దతు ఇస్తున్నట్లే కనిపించినా స్థానిక ఎన్నికల వాయిదా వ్యవహారంతో ఇప్పుడు బీజేపీ తీరు మరోసారి చర్చనీయాంశంగా మారింది.
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ రాష్ట్రంలో తీసుకున్న స్టాండ్‌పై ఆ పార్టీ నేతలే కథలు కథలుగా వినిపిస్తున్నారు. ప్రో టీడీపీ, ప్రో వైసీపీ అంటూ రెండు వర్గాలు రాష్ట్ర బీజేపీలో పనిచేస్తున్నాయని విమర్శలు చేస్తూనే ఉన్నారు. ముఖ్యంగా రాజ్య సభ సభ్యులు జీవీఎల్, ఎమ్మెల్సీ సోమూ వీర్రాజు వంటి వారు టీడీపీకి యాంటీగా, వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తుంటారని అంటుంటారు. అలాగే సుజనా చౌదరి, సీఎం రమేష్ వంటి వారిపై వైసీపీకి వ్యతిరేకులుగా ప్రో టీడీపీ బ్యాచ్‌గా ముద్ర పడింది.
అలాగే రాష్ట్ర బీజేపీ పరోక్షంగా వైకాపాకు మద్దతిస్తోందని టీడీపీ వర్గాల విమర్శలు ఉండనే ఉన్నాయి. అందుకే మూడు రాజధానుల అంశంలో కేంద్రం జోక్యం చేసుకోలేదని.. అలాగే పోలవరం రీ టెండరింగ్ కు సంబంధించి కూడా ఏమీ మాట్లాడకుండా.. తాజాగా నిధులు విడుదల చేయడంతో అది స్పష్టమైందని కూడా అన్నారు. అయితే రాష్ట్రంలో ప్రస్తుతం ఎన్నికల సంఘం నిర్ణయంతో… రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. ఎన్నికల వాయిదాకు నిమ్మగడ్డ రమేష్ పై చంద్రబాబు ప్రభావం చూపారని వార్తలు వస్తున్నా.. దీని వెనుక ఉన్నది మాత్రం బీజేపీనే అన్న ఊహాగానాలు వినబడుతున్నాయి.
రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్‌పై ముగ్గులు ఎంపీలు అమిత్ షా దృష్టికి తీసుకెళ్లడం.. అందులో జీవీఎల్ సంతకం పెట్టడం కూడా కూడా అనేక అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఇష్టం లేకపోయినా జీవీఎల్తో సంకతం పెట్టించారన్న వార్తలు గుప్పుమన్నాయి. దీంతో రాష్ట్ర ఎన్నికల వాయిదా వెనుక బీజేపీ హస్తమున్నట్లు అధికార పార్టీలోనూ అనుమానాలు రెకెత్తున్నాయి. ఓ సారి టీడీపీ వైపు ఉన్నట్లు, మరోసారి వైకాపాకు సాయం చేస్తున్నట్లు ఇలా రెండు వైపులా అవసరానికి తగ్గట్లు మొగ్గుచూపుతోందని.. సమయం వచ్చినప్పుడు రాష్ట్రంలో పాగా వేయాలన్నదే అంతిమ లక్ష్యంగా ఉండొచ్చని విశ్లేషకులు అంటున్నారు. మరి బీజేపీ అసల స్టాండ్ ఏంటి అన్నది మరికొంత కాలం వెళ్తే తప్ప క్లియర్‌గా అర్థం అయ్యేలా లేదు.