షాకింగ్‌…. క‌ర్ఫ్యూ మొత్తం 21 రోజులు… క‌రోనా క‌ట్ట‌డికి ఇదే మార్గం..!

వేలాది మందిని నిలువునా పొట్ట‌పెట్టుకుంటున్న క‌రోనా దెబ్బకు ప్ర‌పంచం మొత్తం మూత‌బ‌డుతోంది. దేశ దేశాల‌న్నీ విధిలేక క‌ర్ఫ్యూ విధిస్తున్నాయి. భార‌త్‌లో ఇప్ప‌టికే వారం రోజుల పాటు పూర్తిగా ర‌వాణా నిలిపివేశారు. దాదాపు 75 జిల్లాల‌లో లాక్‌డౌన్ ప్ర‌క‌టించారు. తెలుగు రాష్ట్రాలు స‌హా మ‌రికొన్ని చోట్ల మొత్తంగా రాష్ట్రం అంత‌టా లాక్‌డౌన్ ప్ర‌క‌టించారు. ఇక‌, గ‌ల్ఫ్ దేశాల్లో అయితే క‌రోనా విజృంభ‌ణ తీవ్రంగా ఉంది. సౌదీ అరేబియాలో మహమ్మారి కరోనా వైరస్ శరవేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో కింగ్ సల్మాన్ ఆదేశాల మేరకు దేశవ్యాప్తంగా 21 రోజుల పాటు అక్కడి సర్కార్ కర్ఫ్యూ విధించింది. సోమవారం సాయంత్రం నుంచి ఈ కర్ఫ్యూ అములోకి వస్తుందని అధికారులు ప్రకటించారు.

మార్చి 23 సాయంత్రం 7 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు ప్రతి రోజు(21 రోజుల పాటు) కర్ఫ్యూ ఉంటుందన్నారు. ఇక ఆదివారం ఒక్కరోజే సౌదీలో ఏకంగా 119 కొత్త కేసులు నమోదు కావడం ఆ దేశంలో ఈ వైరస్ ప్రభావం ఏ స్థాయిలో ఉందో తెలియజేస్తోంది. ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా మహమ్మారి నేపథ్యంలో పలు దేశాలు ప్రయాణాలపై ఆంక్షలు విధించడంతో చాలామంది విమానాశ్రయాల్లోనే చిక్కుకుపోయారు. తాజాగా ఆరుగురు భారతీయులు నాలుగు రోజులుగా దుబాయి విమానాశ్రయంలోనే ఉండిపోయారు. కరోనా భయంతో విదేశాలకు విమాన సర్వీసులు నిలిపివేయడంతో ఆరుగురు ఇండియాకు రాలేని పరిస్థితి.

మార్చి 18న ఈ ఆరుగురు యూరోపియన్ కంట్రీస్ నుంచి దుబాయి చేరుకున్నారు. అక్కడి నుంచి కనెక్టింగ్ విమానాల ద్వారా భారత్ వచ్చేందుకు ముందే టికెట్లు కూడా బుక్ చేసుకున్నారు. కానీ కరోనా విజృంభణతో భారత ప్రభుత్వం ఆ తరువాతి రోజు నుంచి యూరోప్ దేశాల నుంచి వచ్చేవారిపై నిషేధం విధించింది. ఈ నేపథ్యంలో విమానాశ్రయ అధికారులు ఆరుగురిని భారతదేశానికి పంపించేందుకు నిరాకరించారు. దీంతో ఈ ఆరుగురు దుబాయి విమానాశ్రయంలోని టెర్మినల్ 3 వద్ద చిక్కుకుపోయారు. గత నాలుగు రోజులుగా ఎయిర్‌పోర్టులోని బెంచీలపైనే కాలం వెళ్లదీస్తున్నారు. “మూడు రాత్రులుగా విమానాశ్రయంలోని బెంచీలపైనే నిద్రపోతున్నాం. ఇంకా ఎన్ని రోజులు ఇలా ఉండాలో అర్థం కావడంలేదని” దీపక్ గుప్తా అనే ప్రయాణికుడు వాపోయాడు.