మళ్లీ అవే రంగులు వేస్తోన్న జగన్ ప్రభుత్వం!

ప్రభుత్వ కార్యాలయాలకు రంగుల మార్పుపై హైకోర్టు ఎన్నిసార్లు మొట్టికాయలు వేసినా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం మళ్లీ.. అదే తప్పు చేస్తోంది. మూడు వారాల్లోగా, స్థానిక ఎన్నికలకు ముందే రంగులు తొలగించాలన్న హైకోర్టు ఆదేశం మేరకు.. తాజాగా జగన్ ప్రభుత్వం రంగులు మార్చే పనిలో పడింది. అయితే చిన్న మార్పు.. ఆకుపచ్చ, తెలుపు, నీలం రంగులతో పాటు ఇప్పుడు కొత్తగా కొత్తగా కాషాయ రంగు జతచేసింది అంతే. మిగిలిందంతా సేమ్ టు సేమ్.

వైకాపా జెండా రంగులు తొలగించాలని, ప్రభుత్వ కార్యాలయాలకు ఏ పార్టీ రంగులు వేయొద్దని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించిన సంగతి తెలిసిందే. దీంతో ఇప్పుడు రంగులు మార్చే పనిలో పడింది జగన్ ప్రభుత్వం. కానీ మళ్లీ వైకాపా పార్టీ జెండా కలర్లే వచ్చేలా ఎత్తులు ప్రభుత్వం ఎత్తులు వేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి.

గుంటూరు జిల్లాలోని తెనాలి నియోజకవర్గంలోని ఓ పంచాయతీ కార్యాలయానికి కొత్త రంగులు వేశారు. ఆ ఫొటోలు, వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యాయి. అందులో సేమ్ పాత రంగులే వేశారు. వాటికి అదనంగా కాషాయం రంగును జోడించారు. ఇక పంచాయతీ ఆఫీస్‌ను రైతు భరోసా కేంద్రంగా పేరు మార్చేశారు. దీంతో ఇక మార్చి ఏం లాభం మళ్లీ అవే రంగులను మార్చి వేయడం డబ్బు వృథా చేయడం తప్ప అని టీడీపీ నేతలు మండిపడ్డారు.

తాజాగా వెలుగు చూసిన ఈ రంగుల అంశాన్ని చూస్తే.. మొత్తానికి ప్రభుత్వ కార్యాలయాలకు ఏ విధంగానైనా సరే పార్టీ జెండా రంగులే ఉండాలని ప్రభుత్వ పెద్దలు నిర్ణయించి నట్లు ఉన్నారు. అందుకే ఇలా అటూ ఇటూ మార్పులు చేసి మళ్లీ అవే వేయిస్తున్నారు. మరి దీనిపై హైకోర్టు మళ్లీ ఏమంటుందో..! ఎలాంటి తీర్పు ఇస్తుందో?