పవన్ ఢిల్లీ వెళ్లింది అందుకోసమేనా?

సినీ నటుడు, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సడెన్‌గా ఢిల్లీ వెళ్లారు. అయితే ఉన్నట్లుండి ఇలా ఢిల్లీ బయలుదేరి వెళ్లడంతో.. అందరిలో అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అది కూడా స్థానిక
ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో, రిజర్వేషన్ల రగడ నెలకొన్న తరుణంలో ఈ ఢిల్లీ పర్యటన ఆసక్తిని రేపుతోంది.

ఢిల్లీ వెళ్లిన పవన్ కళ్యాణ్ ముందుగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాలను కలిసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. వారితో ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ పరిస్థితులు, రాజకీయ సమీకరణల గురించి, రాజధాని అంశం, బీసీల రిజర్వేషన్, అలాగే స్థానిక, మున్సిపాల్టీ, పంచాయతీ రాజ్ ఎన్నికల పొత్తులపై కూడా పవన్ కళ్యాణ్ వారితో చర్చించనున్నట్లు సమాచారం.

అయితే సాధారణ ఎన్నికల్లో ఎవరికి వారు పోటీ చేసి ఘోర పరాభవాన్ని ఎదుర్కొన్న ఈ రెండు పార్టీలు ఇటీవలే పొత్తు పెట్టుకున్నాయి. ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తే అయినా ఏమైనా లాభం ఉంటుందనే యోచనతోనే పవన్ ను ఢిల్లీకి పిలిచి ఉండవచ్చని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. గతంలో ఇలాగే మంగళగిరిలో పవన్ ఉండగా సడెన్ గా ఫోన్ చేసి ఢిల్లీకి పిలిపించారు బీజేపి పెద్దలు. ఆ తర్వాత పొత్తు పెట్టుకున్నట్లు ప్రకటించారు. ఇప్పుడు మరోసారి ఢిల్లీకి పవన్ వెళ్లాడంటే అది పొత్తులకు సంబంధించి ఖరారు చేసుకునేందుకే అని టాక్. మరి వారి పంపకాలు ఎలా ఉండబోతున్నాయి, కలిసి పోటీ చేయడం వల్ల విజయం వరిస్తుందేమో అన్నది ఎన్నికలు అయ్యాక గానీ చెప్పలేం.