దిశ చట్టంకు ఎదురు దెబ్బ ! తిప్పి పంపిన కేంద్రం

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర శాసన సభ ఆమోదించిన దిశ చట్టంపై రాష్ట్ర పతి ఆమోద ముద్ర పడ లేదు. చట్టం రూప కల్పనలో లోపాలు వున్నాయని కేంద్ర హోంశాఖ తిరిగి రాష్ట్రానికి పంపింది. లోపాలు సరి చేసి పంపమని సూచించింది. సహజంగా ఈ లాంటి చట్టాలు రూపొందించే సమయంలో రాష్ట్ర న్యాయశాఖ భారీ కసరత్తు చేసి చట్టం రూపొందించ వలసి వుంది. ఆలాంటి కసరత్తు జరిగిందో లేదో తెలియదు. గాని కేంద్ర హోంశాఖ తప్పులున్నాయని సరి చేసి పంపమని తిరిగి పంపింది.

అంతవరకైతే ఫర్వాలేదు. చట్టం ఆమోద ముద్ర పడక ముందే రాజమండ్రిలో ముఖ్యమంత్రి దిశ పోలీసు స్టేషన్ ప్రారంభించారు. ఒక వేళ ఏదైనా అలాంటి నేరం జరిగినా చట్టం అమలులో లేదు కాబట్టి కేసు నమోదు చేసే అవకాశం లేదు. అంతేకాదు దిశ చట్టం అమలుకు ఒక యాప్ కూడా తయారు చేసి అమలులో పెట్టారు. వాస్తవంలో ఈ లాంటి యాప్ ఎంతో ఉపయోగ కారి. అప్పుడే ఈ యాప్ ఉపయోగించి ఒక మహిళ తనను వేధింపులకు గురి చేస్తున్నారని సమాచారం ఇవ్వడం ఏడు నిముషాల్లో పోలీసులు ప్రత్యక్షమై నిందితుని అరెస్టు చేసి రిమాండ్ కు పంపడం జరిగినట్లు వార్తలు వచ్చాయి. అయితే దిశ చట్టం అమలులో లేనపుడు ఆ చట్టం కింద కేసు నమోదు చేసే అవకాశమే లేదు.ఇదిలా వుండగా దిశ చట్టం అమలుకు ప్రభుత్వం 42.93 కోట్ల రూపాయల విడుదల చేసింది. దిశ చట్టం అమలులో లేదు. కాబట్టి దిశ పథకం పేరుతో నిధులు విడుదల చేశారు. రాష్ట్ర ప్రభుత్వ న్యాయ శాఖ దిశ చట్టం లోని లోపాలు సరిచేసి కేంద్రానికి పంపిన తర్వాత కేంద్ర హోం శాఖ పరిశీలన చేసి రాష్ట్ర పతి ఆమోద ముద్ర పడే వరకు రాజమండ్రిలో నెలకొల్పిన పోలీసు స్టేషన్ నిమ్మళంగా వుండక తప్పదు.